“సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంటున్నాను. అయితే కొన్ని నెలలు గ్యాప్ తీసుకుంటానంతే. మళ్లీ తప్పకుండా వస్తాను. ఇప్పుడు సమంత 2.O చూస్తున్నారు. త్వరలోనే సమంత 3.O కూడా చూస్తారు. నేను తప్పకుండా నటిస్తాను.”
నాగచైతన్యతో విడిపోవడానికి ముందు ఆగస్ట్ నెలలో సమంత ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. అప్పట్లో ఆ స్టేట్ మెంట్ చూసి అంతా సమంత తల్లి అయ్యేందుకు గ్యాప్ తీసుకుంటోందని అనుకున్నారు. కానీ ఆమె నాగచైతన్యతో విడిపోవడం కోసం గ్యాప్ తీసుకుంటోందనే విషయాన్ని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆ తర్వాత వీళ్లిద్దరి సెపరేషన్ పై గాసిప్స్ రావడం, అదే నిజమవ్వడం చకచకా జరిగిపోయాయి.
అలా శాకుంతలం తర్వాత గ్యాప్ తీసుకున్న సమంత, ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు ప్రకటించబోతోంది. ఇందులో భాగంగా ఈరోజు ఓ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతోంది సమంత. శంతరూబెన్ జ్ఞానశేఖరన్ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇదొక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ.
ఈ మూవీతో పాటు తెలుగులో శివలెంక కృష్ణప్రసాద్ బ్యానర్ పై కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతోంది సమంత. ఆ మూవీ ప్రకటన ఇంకా వెలువడలేదు. అటు బాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టింది. ఫ్యామిలీ మేన్ సీజన్-2 ఇచ్చిన గుర్తింపును క్యాష్ చేసుకుంటూ, ఈ ఏడాది చివరిలోగా బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేయబోతోంది సమంత. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఇలా కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది ఈ హీరోయిన్.