కడప జిల్లాలో సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నారు. ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు.
మైదుకూరు వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్తబ్ధుగా ఉన్నారు. సొంత ప్రభుత్వంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై ఆయన శుక్రవారం వ్యతిరేకంగా మాట్లాడి, తన భవిష్యత్ పంథా ఏంటో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దురదృష్టకర పరిస్థితులు నెలకున్నాయని విమర్శించారు. వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందన్నారు. రైతును పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతు కరువయ్యాడన్నారు. తన సొంత పొలాన్ని కౌలుకు ఇద్దామనుకున్నా ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.
పాలకులు సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని పరోక్షంగా జగన్‌పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి పరోక్షంగా చురకలు అంటించారు.
దారినపోయే వారందరూ మీడియా సమావేశాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు. దీంతో మైదుకూరు రాజకీయం రసవత్తరంగా మారనుంది. మైదుకూరులో డీఎల్‌కు సొంత వర్గం ఉంది. అయితే ఆయన సొంతంగా పోటీ చేస్తారా? లేక బీజేపీలోకి వెళ్తారా? అనేది తేలాల్సి వుంది.