Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

మూవీ రివ్యూ: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

టైటిల్: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
రేటింగ్: 2.5/5
తారాగణం: అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే, ఈష రెబ్బ, ఫరియా అబ్దుల్లా, ఆమని, మురళి శర్మ, వెన్నెల కిషోర్, ప్రగతి, పోసాని, సుడిగాలి సుధీర్, చిన్మయి, రహుల్ రవీంద్రన్ తదితరులు
కెమెరా: ప్రదీష్ వర్మ
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం: గోపీ సుందర్
నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ
కథ- దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్
విడుదల తేదీ: 15 అక్టోబర్ 2021

ఎప్పుడో కరోనాపూర్వం 2019లో మొదలైన ఈ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" రెండు వేవులు దాటుకుని ఎట్టకేలకి రెండున్నరేళ్ల తర్వాత ఈ రోజు విడుదలయింది.

కలర్ఫుల్ తారాగణం, సరదాగా అనిపించిన ట్రైలర్, పూజా స్టాండప్ కమెడియన్ గా మునుపెన్నడూ చూడని పాత్ర చేసిందన్న ప్రచారం మొదలైన కారణాల వల్ల పండగ రోజున హాయిగా ఈ సినిమా చూసి నవ్వుకోవచ్చన్న ఆశల్ని రేకెత్తిచ్చింది. ఇప్పటివరకూ విజయం రుచి చూడని అఖిల్ కి ఈ విజయదశమిరోజున అది సాకారమవుతుందేమోనన్న అభిప్రాయాన్ని కూడా కలగజేసింది.

నిజానికి అఖిల్ అక్కినేని కి, బొమ్మరిల్లు భాస్కర్ కి హిట్టు పడాల్సిన అవసరం ఉంది. హిట్లతో దూసుకుపోతున్న పూజాహెగ్డే, హిట్టు సినిమాల బ్యానరైన గీతా ఆర్ట్స్ ఈ సినిమాకి బ్రాండ్ వేల్యూ పెంచిన అంశాలు.  

పెళ్లిమీద, పెటాకుల మీద గీసిన కార్టూన్లతో టైటిల్స్ మొదలవుతాయి. వాటిల్లో కొత్త క్రియేషన్ ఏదీ లేదు. స్వాతి వీక్లీలో చివరి పేజీలో కనిపించేలాంటి జోకులే.

అఖిల్ అక్కినేని ఇంట్రడక్షన్ సీన్ గొర్రెల మందల మధ్యన పెట్టారు. ఇది ప్రేక్షకుల్ని గొర్రెల్ని చేయబోతున్నాం అని చెప్పడానికి సింబాలిక్ షాట్ అని కాసేపటికి బోధపడుతుంది.

స్టాండప్ కమెడియన్ గా పూజా హెగ్డే చెప్పే జోకులు అర్థం కాక సగటు ప్రేక్షకుడు బుర్రగోక్కునే లోపు ప్రేక్షకులంతా గొల్లున నవ్వుతారు. ప్రేక్షకులంటే హాల్లో ప్రేక్షకులు కాదండోయ్. కథలో స్టాండప్ కామెడీ చూస్తున్న ప్రేక్షకులు. హాల్లో జనం ఎలాగూ నవ్వరని తెరమీద ప్రేక్షకుల్ని సెట్ చేసుకుని నవ్వించుకున్నారన్నమాట.

ఇలా అన్నీ తెలిసే ఆడియన్సుతో ఆడుకుంటున్నారేమో అనే అనుమానాలు వస్తుంటాయి సినిమా చూస్తున్నంతసేపూ. ఎందుకంటే తీసిన బ్యానర్ గీతా ఆర్ట్స్. కంటెంట్ ని ఒకటికి పదిసార్లు కాచివడబోసే సార్లు చాలామందుంటారు ఆ ఆఫీసులో. మరి ఈ కంటెంటుని ఎలా ఓకే చేసారో అర్థం కాదు.

మనసుకి హత్తుకునే ఒక్క సీన్ గానీ డయలాగ్ కానీ లేకుండా చూసుకున్నారు. అంతటితో ఆగకుండా అర్థం లేని సీన్లతో నింపేసి వాటిని ఎంటర్టైన్మెంట్ అనుకోమన్నారు. ముఖ్యంగా పెళ్లిచూపులు చూసిన పెళ్లికూతుళ్లతో నడిపిన కోర్టు సీనైతే అతికి పరకాష్టలాగ ఉంది. అలాగే గుడిలో పూజా, ప్రగతి, అఖిల్ మధ్యన జరిగే సీన్ చూస్తే బొమ్మరిల్లు తీసింది భాస్కరేనా అనిపిస్తుంది.

వెన్నెల కిషోర్ ఈ మధ్య కాలంలో ఇంత పేలవమైన కామెడీ చెయ్యలేదు. అలా చేయించగలిగిన ఘనత భాస్కర్ కే దక్కింది.

ఫస్టాఫు అయ్యాక హీటెక్కున్న ప్రేక్షులకి కనీసం సెకండాఫులో అయినా మంట తగ్గిస్తాడేమో అనుకుంటే ఇంటర్వల్ తర్వాత పొయ్యిని హైఫ్లేములో పెట్టాడు దర్శకుడు.

చుక్కాని తెగిన నావలాగ కథ ఎటో కొట్టుకుపోతూ ఉంటుంది. హీరోని ఔలా బైకుని నడిపే వాడిగా మార్చి నడిపిన ట్రాక్ అస్సలు ఆకట్టుకోకపోగా చిరాకు తెప్పిస్తుంది.

టెక్నికల్ గా చూస్తే గోపీసుందర్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా వినడానికి బాగానే ఉన్నాయి. కంటికి ఇంపుగా ఉన్నా చాలా చోట్ల సబ్ టైటిల్స్ లేని పరభాషా చిత్రం చూస్తున్న ఫీలింగొస్తుంది... ముఖ్యంగా స్టాండప్ కామెడీ సీన్లప్పుడు.

అనుకున్న కథని తెరకెక్కించడంలో లోపాలు కనిపించినా క్షమించొచ్చు కానీ అశ్రద్ధని మాత్రం భరించడం కష్టం. ఆ అశ్రద్ధ ఇక్కడ స్క్రిప్టులోనూ, డయలాగ్స్ లోనూ ఆద్యంతం కనిపిస్తుంది.

అఖిల్ ఒక సీన్లో పూజాకి ఏదో చెవిటి కప్ప కథ చెబుతాడు. అది పూర్తిగా అర్థమైన ఆడియన్స్ ఐక్యూ లెవెల్ ఐన్స్ టీన్ ఐక్యూతో సమానమని చెప్పొచ్చు. ఈ సినిమా ఆ రేంజ్ ఐక్యూ ఉన్న ఆడియన్స్ కి మాత్రమే అని తీర్మానించుకోవచ్చు.

అఖిల్ అక్కినేనికి లుక్, వాయిస్ ఇలా కమెర్షియల్ హీరోకి కావల్సినవన్నీ ఉన్నాయి కానీ సరైన స్క్రిప్టే ఇంతవరకూ దొరకకపోవడం ఆశ్చర్యకరం. ఈ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" ఆ ఆశ్చర్యాన్ని ఇంకా పెంచింది.

ఇదే బ్యాక్ డ్రాపుతో "షాదీముబారక్" చక్కగా తీసిన సినిమా. అందులో సింప్లిసిటీతో పాటూ సెన్సిబుల్ కామెడీ ఉంటుంది. ఈ పండక్కి హాలుకొచ్చి ఎలిజిబుల్ బ్యాచిలర్ ని చూసి హైరాన పడే కంటే ప్రైం వీడియోలో "షాదీ ముబారక్" చూసుకోవడం ఉత్తమం.

బాటం లైన్: మోస్ట్ ఎలిజిబుల్ "బాయిలర్"

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?