మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ అర్కే (65) ఈ లోకాన్ని శాశ్వతంగా వీడారని మవోయిస్టు పార్టీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు వెల్లడిస్తున్న అనుమానాలకు తెరదించినట్టైంది.
కామ్రేడ్ ఆర్కే అనారోగ్యంతో మృతి చెందినట్టు ఛత్తీస్‌గఢ్ డీజీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అగ్రనాయకుడు మృతి చెందితే, ఆ విషయాన్ని మావోయిస్టు పార్టీనే ప్రకటిస్తుందని ప్రజాసంఘాలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ఎట్టకేలకు ప్రకటన వెలువడింది.
ఒకవేళ ఆర్కే మృతి చెంది ఉంటే ప్రభుత్వం, పోలీసులు మానవతా దృక్పథంతో అప్పగిస్తే తుది వీడ్కోలు పలుకుతామని కుటుంబ సభ్యులు విన్నవించిన సంగతి తెలిసిందే. అయితే విప్లవ శ్రేణుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంకా ఆ ప్రకటనలో ఏముందంటే…
కామ్రేడ్ హరగోపాల్‌కు అకస్మాత్తుగా కిడ్నీ సమస్య తలెత్తిందన్నారు. వెంటనే డయాలసిస్ ట్రీట్‌మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని పేర్కొన్నారు. అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన అమరుడయ్యాడని పేర్కొన్నారు. మంచి వైద్యం అందించినప్పటికీ ఆయన్ను దక్కించుకోలేక పోయినట్టు వాపోయారు.
1978లో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులై భాకపా (మాలె)(పీపుల్స్‌వార్)లో సభ్యత్వం తీసుకున్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఆయన కేంద్ర కమిటీ నాయకత్వం వరకూ ఎదిగిన క్రమాన్ని ఆ ప్రకటనలో వివరించారు.
ప్రస్తుతం ఏవోబీలో ప్రభుత్వం కొనసాగిస్తున్న నిర్బంధకాండలో పార్టీని, కేడర్‌ను రక్షించే బాధ్యతల్ని నిర్వర్తిస్తూ అనారోగ్యం బారిన పడి అమరుడయ్యాడని ఆయన తెలిపారు. కామ్రేడ్ ఆర్కే ఆశయాలను కొనసాగిస్తామని వెల్లడించారు. దీంతో ఆర్కే మృతిని నిర్ధారించినట్టైంది.