వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో ఓటుకు నోటు ఇస్తారా? ఇవ్వరా? అనేది చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఓటర్లకు డబ్బు పంపిణీ అధికార పార్టీ చర్యలపై ఆధారపడి ఉంటుంది.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేయకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. అధికారంలో ఉంటూ ఆర్థిక, అంగబలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, వైసీపీ మాత్రం వాటి జోలికి వెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
ఈ నేపథ్యంలో బద్వేలు ఉప ఎన్నికలో అధికార పార్టీ వైఖరి ఏంటనే చర్చ జరుగుతోంది. బద్వేలు ఉప ఎన్నికలో కూడా ఓటర్లకు డబ్బు పంపిణీ చేయకూడదని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
సంక్షేమ పథకాలకు భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నామని, వాటి ప్రభావం ఏ మాత్రం ఉంటుందో తెలుసుకోడానికైనా డబ్బు పంపిణీ చేయకూడదని బద్వేలులో వైసీపీ ఎన్నికల నిర్వాహకులకు సీఎం జగన్ తేల్చి చెప్పినట్టు సమాచారం.
ఇది కొంత మంది నాయకులకు నిరుత్సాహం కలిగిస్తున్నట్టు సమాచారం. అధికారంలో ఉన్న పార్టీ పంపే డబ్బులో కొంత మొత్తాన్ని మిగిల్చుకుందామని ఆశించిన వారికి సీఎం నిర్ణయంతో నిరాశే ఎదురైనట్టు చెబుతున్నారు.
ముఖ్యంగా ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేయకుండా గట్టి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా అభినందనలు వస్తున్నాయి.