విశాఖలో ఉక్కు పరిశ్రమ పెట్టాలి. ఇది ఆంధ్రుల డిమాండ్. అయితే నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం కర్నాటలోని హోస్పేటలో పెట్టాలని నిర్ణయించింది. దాంతో ఉమ్మడి ఏపీ అంతా ఆనాడు ఉద్యమ సెగలు చెలరేగాయి. ఉక్కు సంకల్పంతో ఉవ్వెత్తిన కడలి తరంగాలను మించి ఆవేశం లేచింది.
సరిగ్గా ఇదే రోజున అంటే ఇప్పటికి యాభై అయిదేళ్ల క్రితం 1966 అక్టోబర్ 15న విశాఖ కలెక్టరేట్ ఎదుట స్వాతంత్ర సమరయోధుడు అమృతరావు ఉద్యమ బాట పట్టారు. విశాఖకు ఉక్కు కర్మాగారం రావాల్సిందే అంటూ ఆయన అమరణ నిరాహార దీక్షను చేపట్టారు.
అది అగ్గిలా మారి ఏకంగా రాష్ట్రంలోని 32 మంది యువకులు బలిదానం చేశారు. ఎంతో మంది జైలు పాలు అయ్యారు. మొత్తానికి కేంద్రం దిగి వచ్చి విశాఖ ఉక్కును ప్రకటించింది. మరో వైపు చూస్తే సరిగ్గా 55 ఏళ్ల తరువాత మళ్లీ ఉక్కుని కాపాడుకోవడం కోసం మరో ఘనమైన ఉద్యమం సాగుతోంది. ఇప్పటికి 250 రోజులుగా విశాఖలో ఉక్కు కార్మికులు ఆందోళన నిరంతరాయంగా చేస్తూనే ఉన్నారు.
కేంద్రం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి అమృతరావు ఇచ్చిన స్పూర్తితో మరింతగా ఉద్యమించడానికి కార్మిక లోకం సిద్ధంగా ఉంది. విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి ఆంధ్రూలంతా ఒక్కటి కావాలని స్టీల్ కార్మిక లోకం పిలుపు ఇస్తోంది.