వేపకాయంత వెర్రి ఉన్నట్లుగా ప్రజలకు ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. ఫలానా పని చేస్తే మంచి జరుగుతుందని, ఫలానా పని చేస్తే చెడు జరుగుతుందని కొందరు భావిస్తుంటారు. ఇలాంటి సెంటిమెంట్లు ప్రధానంగా రాజకీయ నాయకులకు ఎక్కువగా ఉంటాయి. వారెప్పుడూ విజయాలు రావాలనే కోరుకుంటారు కాబట్టి అందుకు తగ్గట్లుగానే వీరికి సెంటిమెంట్లు ఉంటాయి. ఇందుకు తెలంగాణా సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కూడా మినహాయింపు కాదు. వీరిద్దరికీ ఉన్న కామన్ సెంటిమెంటు దేవుడి మీద అపారమైన నమ్మకం.
తమ రాజకీయ విజయాల కోసం ఒకపక్క ప్రజల మీద ఆధారపడతారు. పథకాలు అమలు చేస్తారు. వ్యూహాలు పన్నుతారు. అదనంగా దేవుడిని నమ్ముకుంటారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్న సీఎం జగన్ తాను నమ్ముకున్నది ఆ దేవుడిని. ఆ తరువాత ప్రజలను. ఇద్దరు సీఎంలకు మొదటి ప్రాధాన్యం దేవుడు. రెండో ప్రాధాన్యం ప్రజలు. సీఎం జగన్ 2019 నుంచి ఇప్పటి వరకు ఆధ్మాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా విశాఖ శారదా పీఠం పైన సీఎం జగన్ కు నమ్మకం ఎక్కువ. అక్కడ నిర్వహించే రాజశ్యామల యాగంలో పాల్గొంటున్నారు. ఆ యాగంతో తిరిగి సీఎంగా అధికారం ఖాయమని నమ్ముతున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఈ యాగం ఒక సెంటిమెంట్. ప్రతీ ముఖ్యమైన కార్యక్రమం సమయంలో ఈ యాగం చేస్తారు. గతంలో కేసీఆర్ చేసిన సూచనల మేరకే సీఎం జగన్ ప్రతీ ఏటా ఈ యాగంలో పాల్గొంటున్నారు. సీఎం జగన్ మతపరంగా క్రిస్టియన్. ఒక పక్క క్రీస్తును నమ్ముతూనే మరో పక్క అత్యధికంగా హిందూ ఓటర్లు ఉన్నారు కాబట్టి వారి మాతాచారాలను కూడా పాటిస్తుంటారు. అందులో భాగమే యాగాలు చేయడం. విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు ప్రతీ ఏటా ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు. వార్షికోత్సవాల వేళ చివరి రోజున రాజశ్యామల యాగం చేయటం ఆనవాయితీ. 2023లో కూడా పీఠం వార్షికోత్సవాలు ఉన్నాయి. జనవరి 27 నుంచి 31 వరకూ అయిదు రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలలో భాగంగా మరోసారి రాజశ్యామల యాగం చేయనున్నారు.
వార్షికోత్సవాలకు సంబంధించి శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ ఆఫీసులో కలిసారు. ఆహ్వాన పత్రం అందచేశారు. జగన్ తొలి నుంచి శారదా పీఠం స్వామజీ స్వరూపానందేంద్ర స్వామీజీ అంటే నమ్మకం. 2019 ఎన్నికల సమయంలోనూ పార్టీ ఎంపీ ఒకరు నెల్లూరు కేంద్రంగా రాజశ్యామల యాగం నిర్వహించారు. విచిత్రంగా 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రతీ ఏటా విశాఖ శారదా పీఠంలో జరిగే కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజశ్యామల యాగం పైన మంచి గురి ఉంది. ప్రతీ ముఖ్యమైన కార్యక్రమం వేళ ఈ యాగం కేసీఆర్ ఖచ్చితంగా నిర్వహిస్తారు. కేసీఆర్ వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చినా రాజశ్యామల యాగం నిర్వహణ కొనసాగిస్తున్నారు. తాజాగా.. బీఆర్ఎస్ ప్రకటించిన కేసీఆర్.. ఢిల్లీ కేంద్రంగా ఈ యాగం నిర్వహణతోనే పార్టీ కార్యాలయం ప్రారంభించారు. సీఎం జగన్ – సీఎం కేసీఆర్ సన్నిహిత సంబంధాలు కొనసాగిన రోజుల్లో ఇద్దరూ స్వరూపానందేంద్ర అమరావతిలో నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు. అదే విధంగా విశాఖకు వచ్చి సీఎం కేసీఆర్ స్వామి స్వరూపానంద నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి జగన్ కు ఈ యాగం గురించి కేసీఆర్ సూచించారని..ప్రతీ ఏటా నిర్వహించాలని సూచించారని సమాచారం. 2019 లో జగన్ కోసం ఆ యాగం చేయటం..అధికారం దక్కటం జరిగాయి.
ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలుపు కోసం వ్యూహాలు సిద్దం చేస్తున్న జగన్ ..ఇటు ఆధ్యాత్మికంగానూ రాజశ్యామల యాగంలో పాల్గొంటున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఉప ఎన్నికలు..స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జగన్ ఏకపక్ష విజయం సాధించారు. దీంతో సీఎంతో పాటుగా మంత్రులు.. పార్టీ ప్రముఖులు తరచూ శారదా పీఠం సందర్శిస్తున్నారు. ఈ సారి జరిగే వేడుకల్లోనూ సీఎం పాల్గొంటారాని తెలుస్తోంది. దీని ద్వారా 2024లోనూ జగన్ కు అటు అమ్మవారి ఆశీస్సులు..ఇటు ప్రజా మద్దతుతో గెలుపు ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు.ఇప్పటికే అనేక సార్లు యాగాలు చేసిన కేసీఆర్..గత ఎన్నికలకు ముందు రాజ శ్యామల యాగం చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు.
ఎన్నికల విజయం తరువాత సహస్ర చండీ యాగం చేశారు. ఇప్పుడు బి ఆర్ ఎస్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా మళ్లీ రాజ శ్యామల యాగం చేస్తున్నారు. కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ అందుకు ప్రతిఫలం పొందారని..ఈ సారికూడా రాజ శ్యామల యాగం ద్వారా జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తారని పార్టీ వర్గాల విశ్వాసం. మహాభారతంలో ధర్మరాజు తో శ్రీ కృష్ణుడు చేయించిన రాజసూయ యాగం, ప్రస్తుతం కేసీఆర్ అండ్ జగన్ చేస్తున్న రాజ శ్యామల యాగం ఒకటేనా అంటే…ఈ రెండు యాగాలు ఒకటే కాకపోయినా వాటి వెనకున్న ఆంతర్యం, పరమార్థం మాత్రం ఒకటే.
ప్రారంభించిన కార్యంలో విజయం అందుకోవాలి, శత్రువులు క్షీణించాలి, సార్వ భౌమాధికారం సిద్ధించాలి, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని చేస్తారు. రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు అది నిర్వహించడం అంత సుసాధ్యం కాదు అందుకే అందుకు ప్రతిగా రాజశ్యామల యాగం ద్వారా విజయం సిద్ధించేలా చేయేమని శ్యామలా దేవిని ప్రసన్నం చేసుకుంటారు. యాగాలు చేయడం కేవలం సెంటిమెంటా? లేదా దానివల్ల నిజంగా అనుకూల ఫలితాలు వస్తాయా? అంటే చెప్పలేం. ఎవరి నమ్మకాలు వారివి.