ఏపీ సీఎం జగన్ – ఆయన సోదరి షర్మిల మధ్య ఏం జరిగిందో సరిగ్గా తెలియదు. కానీ వాళ్లిద్దరి మధ్య పడకుండా పోయింది. ఇద్దరి మధ్య ఆస్తుల గొడవలు ఉన్నాయని కొందరు అంటున్నారు. జగన్ పార్టీ పెట్టాక షర్మిలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కనపెట్టారని, అందుకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని కొందరు అంటున్నారు. కానీ సరైన కారణాలు తెలియవు.
కారణాలు ఏమైనప్పటికీ షర్మిల తెలంగాణాకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. అధికారంలోకి వస్తానని బల్లగుద్ది చెబుతున్నారు. జగన్ అంటే షర్మిలకు పడదు. కరెక్టే. కానీ ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ కు కూడా పడదా? దీనికి సమాధానం అవుననే చెప్పుకోవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో బ్రదర్ అనిల్ కుమార్ ఏకంగా తన బోధనల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శాపూరితమైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
తాజాగా ఒక ప్రసంగంలో బ్రదర్ అనిల్ మాట్లాడుతూ “తమ స్వార్థాల కోసం ప్రజలకు ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చే పథకాలను నమ్ముకోవద్దని” ఆయన హితవు పలికారు. దేవుడి పథకాలు ఇంకా గొప్పగా ఉంటాయని ఆయన అన్న మాటలకు అందరూ అవాక్కయ్యారు. సరే ఏదో దేవుడు ప్రజలకు ఏర్పరచిన ప్లాన్లు గొప్పగా ఉంటాయని అలా పోల్చారనే అనుకుందాం. అయితే ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. అనిల్ తన ప్రసంగాన్ని ముందుకు కొనసాగిస్తూ.ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండుననే భావన ప్రజల్లో ఏర్పడింది అన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
బ్రదర్ అనిల్ ఈ వ్యాఖ్యల సమయంలో ఎక్కడా ముఖ్యమంత్రి..పార్టీ పేరు ప్రస్తావించలేదు. కానీ, ప్రభుత్వం..ప్రభుత్వాలు అంటూ తన దైవ వాక్యం మధ్యమధ్యలో పరోక్షంగా విమర్శలు చేసారు. గతంలోనూ విశాఖ – విజయవాడ పర్యటనల సమయంలో ఏపీ రాజకీయాలపైన బ్రదర్ అనిల్ ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. అన్న జగన్ తో సోదరి షర్మిల విభేదించి తెలంగాణలో పార్టీ ఏర్పాటు తరువాత బ్రదర్ అనిల్ ఏపీ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఒక దశలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలతో ఏపీ కేంద్రంగా సమావేశమైన బ్రదర్ అనిల్ కొత్త పార్టీ దిశగా చర్చలు చేసారు. వారంతా ఎన్నికలకు ముందు వైసీపీకి మద్దతుగా నిలిచారని..ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు దిశాగా ఆలోచన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వారు పార్టీ ఏర్పాటు చేస్తే తాను మద్దతు ఇస్తానని అప్పట్లోనే బ్రదర్ అనిల్ స్పష్టం చేసారు. తరువాత బ్రదర్ అనిల్ పార్టీ ఏర్పాటు ఖాయమని ప్రచారం సాగింది. కానీ, అనిల్ తాను పార్టీ ఏర్పాటు చేయటం లేదని స్పష్టత ఇచ్చారు.
ఆ తరువాత రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లిలో బ్రదర్ అనిల్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆ భేటీ తరువాత రాజకీయ పరిస్థితుల పైన చర్చించామని చెప్పారు. అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయంటూ ఆసక్తి పెంచారు. మొత్తం మీద షర్మిల దంపతులు జగన్ పట్ల అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.