భారతదేశంలో వస్తున్న మార్పులు ఇక్కడ ఉన్నవాళ్లకంటే అమెరికా నుంచి కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్న ఎన్నారైలకి ఎక్కువగా తెలుస్తోంది. నిజంగానే భారత్ వెలిగిపోతోందని వాళ్లంటున్నారు. అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఎందువల్ల భారత్ వెలుగుబాటలో ఉందనిపిస్తోందో చూద్దాం. ఇది భాజపా ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే వ్యాసం కాదు. కొన్ని వాస్తవాల్ని ఒప్పుకుంటూ వ్రాస్తున్నది. దయచేసి గమనించగలరు.
దేశంలో ఒక వర్గం ప్రజలది ప్రధానంగా ఒకటే కంప్లైంటు. భాజపా ప్రభుత్వానికి మతం కార్డు వాడి దేశాన్ని కాషాయీకరణం చేసే ఎజెండా తప్ప మరొకటి లేదని. ఆ మనోభావాల్ని పక్కన పెట్టి అసలు దేశం ఆర్ధికంగా ఏ దిశగా వెళ్తోందో, ఎందుకు వెళ్తోందో పరిశీలిద్దాం.
8 నవంబర్ 2016… దేశంలోని ప్రజలు మరిచిపోలేని రోజు. అప్పటికి నరేంద్రమోది ప్రధాని పీఠమెక్కి రెండేళ్లయ్యింది. ఆ రోజు రాత్రి ఆయన చేసిన ప్రకటన రూ500, రూ1000 నోట్ల రద్దు గురించి. ఆ ప్రకటనకి దేశంలో విపరీతమైన కలకలం ఏర్పడింది. మూటలు మూటలుగా కట్టి దాచిన బ్లాక్ మనీ బ్యాంక్ బాట పట్టి వైట్ మనీగా మార్చుకోవాల్సిన పరిస్థితి. ఈ వార్తకి సగటు పౌరుడు మాత్రం చప్పట్లు కొట్టాడు. దేశంలో ఉన్న బ్లాక్ మనీ మొత్తం మాయమైపోతోందని, తద్వారా ఏదో మార్పు తన జీవితంలో కూడా రాబోతోందని ఊహించాడు. కానీ ఆ మార్పు ఏదో మ్యాజిక్ లాగ వెంటనే వచ్చేస్తుందనుకున్నాడు. అది నిజం కాకపోయినా అక్కడి నుంచి ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం.
నోట్ల రద్దు అయ్యిందో లేదో కాశ్మీర్లో రాళ్లు రువ్వి అల్లర్లు చేసే ముఠాలు మాయమైపోయాయి. కొన్ని వర్గాల ప్రోద్బలంతో డబ్బు పుచ్చుకుని చేసిన ఆ కృత్రిమ ఉద్యమం నోట్ల రద్దు వల్ల నీరుగారిపోయింది. తద్వారా కాశ్మీర్లో అల్లర్లు సద్దుమణిగాయి.
ఇక సామాన్యుడు చేతిలో కరెన్సీ నోట్లు లేకపోవడంవల్ల తప్పని సరిగా పేటీయం ఆప్ ని మొబైల్లో వేసుకుని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మొదలుపెట్టాడు. ఈ యాప్ ఉండాలంటే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరికాబట్టి వెంటనే తోచిన బ్యాంకులో అకౌంటు తెరిచాడు. అరటిపండ్లు, మల్లెపూలు, మొక్కజొన్నకంకులు, బజ్జీలు, పానీపూరీలు …ఇలా ఏ చిరువ్యాపారం చేసుకునే వాడైనా చేతుల్లో కరెన్సీ లేని కష్టమర్ల కోసం పేటీయం క్యూఆర్ కోడ్ ని తమ బండి మీద పెట్టడం మొదలుపెట్టాడు. అవన్నీ చిన్న మొత్తాల్లా కనిపించవచ్చు. కానీ తమ కష్టమర్స్ నుంచి వచ్చిన రూ 10 అయినా, రూ 25 అయినా, రూ 100 అయినా నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంటుకి చేరడం మొదలుపెట్టింది తప్ప ఎవరి జేబుల్లోకి చేరి ఆగిపోలేదు.
గతంలో అయితే అరటిపండ్ల వ్యాపారి ఆ రోజంతా సంపాదించిన ఏ రూ 500ల్లోనో కొంత తీసి భార్యకి ఇచ్చేవాడు. ఆవిడ పోపుడబ్బాలో దాచుకునేది. కానీ ఇప్పుడలా కాదు. పేటీఎం ల వల్ల ఎంత చిన్నమొత్తమైనా బ్యాంకుల్లోనే సర్క్యులేట్ అవుతోంది. అకౌంట్ నుంచి అకౌంట్ కి డాబు పంపుకోవడం తప్ప క్యాష్ విత్ డ్రా చేసేవాళ్లు తగ్గిపోయారు. కోట్లకు పడగలెత్తిన ధనవంతులకన్నా ఈ సమాన్యజనమంతా కలిసి బ్యాంకుల్లో ప్రవహింపజేస్తున్న డబ్బు చాలా ఎక్కువ. దానివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ బలపడింది.
ఆర్ధికపన్ను బ్రాకెట్లో లేనివాళ్లు కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని డిజిటల్ పేమెంట్స్, ఎర్నింగ్స్ చేస్తున్నవాళ్ళు దేశంలో కోట్లల్లో ఉన్నారు. ఇదంతా 2016 తర్వాతే జరిగింది.
దీనికి తోడు 2020లో ప్రపంచవిపత్తు కరోనా వచ్చినప్పుడు కూడా కరెన్సీ నోట్ల ద్వారా కూడా వైరస్ సంక్రమిస్తుందన్న భయంతో జనం మరింతగా డిజిటల్ పేమెంట్స్ కి అలవాటు పడ్డారు. తమ ఆరొగ్యానికే కాకుండా దేశంలోని బ్యాంకుల ఆరోగ్యానికి కూడా అది రక్ష అయింది.
ఇదంతా ఒకెత్తైతే, ఇక జీఎస్టీ దేశానికి ఆర్ధికకండపుష్టిని విపరీతంగా పెంచుతోంది. నెలకి దాదాపు లక్షన్నర కోట్లకి పైగా జీఎస్టీ వసూలవుతోందంటే అదంతా వైట్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోవడం వల్లే. ఇన్-కం ట్యాక్స్ ని జీఎస్టీతో అనుసంధానం చేయడం వల్లే.
ఈ దేశ జనాభా 140 కోట్ల పైచిలుకు. రానున్న నెలల్లో చైనాను తలదన్ని అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలవబోతోంది. అయితే అప్పటికి ఏ ఒక్క పౌరుడు కూడా బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉండకూడదన్నది పాలకుల సంకల్పంలా ఉంది. ఎందుకంటే కరెన్సీ ముద్రణ బాగా తగ్గించేసారు. రూ 2000 నోట్లు చలామణీలో ఉన్నా బ్యాంకుకి వెళితే తిరిగి బైటకి రావట్లేదు. ప్రస్తుతం చలామణీలో ఉన్న పెద్ద నోటు రూ 500. త్వరలో అది కూడా రద్దు చేసేస్తే పెద్ద నోటు రూ 200 అవుతుంది. దాంతో బ్లాక్ మనీ మూటలు కట్టడం, దాయడం ఇక ఎవరి తరమూ కాదు.
దేశంలో అడుక్కునే బెగ్గర్స్ కూడా పేటీయం క్యూఆర్ కోడ్ ద్వారా అడుక్కునే పరిస్థితులు రాబోతున్నాయనిపిస్తోంది. ఎందుకంటే బయటికి వెళ్లేటప్పుడు జేబులో చిల్లర పెట్టుకుని వెళ్లేవాళ్లు తగ్గిపోయారు. అసలిప్పుడు చిల్లర కనిపించడం తగ్గిపోయింది. ఏ చిన్న పేమెంటయినా మొబైల్ తీసి పేటీయం, ఫోన్ పే, గూగుల్ పే అంటున్నారు.
ఇక ఈ దేశంలో విపరీతమైన డబ్బుంది. అదంతా స్ట్రీంలైన్ అవుతోంది. లాంబోర్గినిలు, హెలికాప్టర్లు కొనగలిగే వాళ్లు ఎందరో కనిపిస్తున్నారు. గతంలో బ్లాక్ మనీ రోజుల్లో అంతంత ఖర్చులు పెట్టే వాళ్లు కాదు. ఇప్పుడంతా వైట్ మనీ అవుతోంది కనుక హుందాగా ట్యాక్స్ కట్టి, ధైర్యంగా ఉన్నదాన్ని ఖర్చు చేసి, దర్జా చాటుకుంటున్నారు. దంతా కేవలం బిగినింగ్ మాత్రమే. మునుముందు దేశంలో కుబేరుల లిష్ట్ మరింతగా ఉండబోతోంది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్న ముఖ్యమైన అంశం బేసిక్ ఇంఫ్రాస్ట్రక్చర్. ప్రస్తుతానికి నేషనల్ హైవేలు తప్ప మిగిలిన రోడ్లన్నీ దారుణంగానే ఉంటున్నాయి చాలా చోట్ల. అవన్నీ నిర్మించి మెయింటైన్ చేసే పని ప్రభుత్వం పెట్టుకోకుండా పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) మోడల్లో కొన్ని కంపెనీలకి అప్పజెప్పబోతోంది. ఎల్ అండ్ టీ కంపెనీ హైదరాబాద్ మెట్రోని నిర్మించినట్టు, జీఎమ్మార్, జీవీకే, అదానీ కంపెనీలు విమానాశ్రయాలు నిర్మించి నిర్వహిస్తున్నట్టు ఇక దేశంలోని రోడ్లన్నీ భారీ ప్రైవేట్ కంపెనీలు నిర్మించి నిర్వహిస్తాయి. అదే జరిగితే ఇక ఇండియా రోడ్లకి, అమెరికా రోడ్లకి క్వాలిటీ పరంగా పెద్దగా తేడా ఉండదు. రోడ్ ఇంఫ్రాస్ట్రక్చర్ బాగుంటే దేశం దాదాపు రిపేరైనట్టే. ఈ దిశగా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ ప్రాజెక్టులకి శ్రీకారం చుడుతోంది. మిగతా దేశం కూడా ఆ పద్ధతి ఫాలో అవ్వాల్సిందే.
దీనికి తోడు నెమ్మదిగా ప్రపంచవిపణిలో డాలర్ ప్రమేయాన్ని తగ్గిస్తూ రూపాయితో అంతర్జాతీయ ట్రేడ్ కు తెరలేపింది ఇండియా. ఇప్పటికే దాదాపు ఐదారు దేశాలు ఇండియన్ రూపీ ట్రేడ్ కి తలలూపాయి. దీనివల్ల రూపాయి విలువ పడకుండా పటిష్టమవుతుంది. ఈ మధ్య డాలరు విలువ రూ 75 నుంచి రూ 82 దాకా పెరిగేటప్పటికి అది మోదీ ప్రభుత్వ వైఫల్యమని ఎద్దేవా చేసారు. “డాలరు విలువు పెరగడం వల్ల రూపాయి విలువ తగ్గినట్టు కనిపిస్తోంది తప్ప నిజానికి రూపాయి పటిష్టంగానే ఉంది” అని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ అంటే పలువురు ఆమెను విమర్శించారు. కాస్త ఆలోచిస్తే ఆమె చెప్పింది నిజం. దానికి ఒకటే లెక్క.
రూపాయి విలువ నిజంగా పడితే ప్రపంచంలోని అన్ని పెద్ద కరెన్సీల ముందు రూపాయి విలువ దారుణంగా తగ్గిపోవాలి. కానీ అది జరగలేదు. కేవలం అమెరికన్ డాలర్ విషయంలోనే ఏడు రూపాయలు తగ్గింది. దీనికి కారణమేంటంటే అమెరికా తన డాలరుపై సుంకాన్ని పెంచడం ఒకటి, స్టాక్ మార్కెట్లో రూపీ ఆధారిత పెట్టుబడులనుంచి డాలర్ ఆధారిత పెట్టుబడులవైపు ఇన్వెస్టర్స్ మళ్లడం మరొకటి. పర్యవసానంగా అంతర్జాతీయ ట్రేడ్ మొత్తం డాలర్స్ తోనే సాగుతుంది కాబట్టి భారత్ ది కూడా డాలార్ ఆధారిత మార్కెట్ కాబట్టి కాస్త దెబ్బ తినాల్సొచ్చింది. నిజానికి ఆ సమయంలో డాలరు ముందు బ్రిటీష్ పౌండ్, యూరో ఇలా అన్ని కరెన్సీలు చతికిలపడ్డాయి. ఇండియా చతికిలపడలేదు. దెబ్బని ఓర్చుకుని నిలబడింది. ఈ పరిస్థితుల్ని భవిష్యత్తులో తట్టుకోవాలంటే అంతర్జాతీయంగా పలు దేశాలతో రూపీ ట్రేడ్ కొనసాగుతుండాలి. అందుకే ఆ దిశగా దేశం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఏది ఏమైనా స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఇండియా ఆర్ధిక పుష్టిని గణనీయంగా చూపిస్తోంది.
ఎడోబ్ చీఫ్ శంతను నారాయణ్ ఈ మధ్యన ఒక మాటన్నాడు. ఈ సమయంలో తాను హైదరాబాదులో ఎదుగుతున్న వయసులో ఉంటే కనుక తానసలు అమెరికాకే వెళ్లేవాడని కానని చెప్పాడు. దీనినిబట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇండియా ఏ దిశగా పరుగుతీస్తోందో… అందులో హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకుని తీరాలి.
ఇక్కడ కేంద్ర భాజపా ప్రభుతాన్ని గురించి మరొక ఆసక్తికరమైన అంశం చెప్పుకోవాలి. 2017-18 లో ఆ ప్రభుత్వం అడ్వెర్టైజ్మెంట్స్ కి పెట్టిన ఖర్చు రూ1220 కోట్లు, 2018-19లో రూ 1106 కోట్లు, 2019-20లో 627 కోట్లు, 2020-21లో 349 కోట్లు, 2021-22లో 264 కోట్లు, 2022-23లో ఇప్పటి వరకు సుమారు 155 కోట్లు. ఎంత గణనీయంగా వృధా ఖర్చు తగ్గిస్తోందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అంతే తప్ప ప్రైవేట్ మీడియాకి వేలాది కోట్లు గుమ్మరించి సొంతడబ్బా కోట్టించుకునే పని అస్సలు చేయట్లేదు.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత్ కచ్చితంగా మరింత బాగా వెలుగుతుంది. అమెరికాకి దీటుగా కూడా నిలబడుతుంది.
– హరగోపాల్ సూరపనేని