విశాఖ వైపు ఇపుడు అంతా చూసే పరిస్థితి ఏర్పడింది. విశాఖ గ్రేట్ సిటీ అని ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటనలో పేర్కొన్నారు. ఎన్నో రకాలుగా ప్రశంసలు కురిపించారు. క్లీన్ గ్రీన్ సిటీగా పేరు గడించిన విశాఖకు ఇపుడు ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతోంది.
విశాఖపట్నంలో బయో టెక్నాలజీ పార్క్ ని ఏర్పాటు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే జోరుగా సాగుతున్నాయి. విశాఖలో బయో టెక్నాలజీ పార్క్ కోసం ప్రతిపాదనలు వచ్చాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్ లో వెల్లడించారు.
త్వరలో దీనికి సంబంధించి మరింత చొవర చూపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అని అంటున్నారు ఈ పార్క్ కనుక వస్తే ఉపాధి పెద్ద ఎత్తున లభించడంతో పాటు ప్రగతి గతి కూడా మారుతుందని అంటున్నారు. విశాఖలో బయో ఇంక్యుబేషన్ సెంటర్లు కూడా రెండు రాబోతున్నాయి. ఏపీకి బయో ఇంక్యుబేషన్ సెంటర్లు మూడు మంజూరు అయితే అందులో రెండు విశాఖలో ఏర్పాటు అవుతున్నాయి.
విశాఖ విషయంలో మరిన్ని కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్న నేపధ్యంలో ఐటీ పరంగా కూడా విశాఖ ముందడుగు వేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. విశాఖకి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు మరికొన్ని కీలకమైనవి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి కారణం విశాఖకు ఉన్న పొటెన్షియాలిటీయే అని చెప్పక తప్పదు.