విశాఖలో ఒక వైపు కాపునాడు పేరిట భారీ ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నారు. వంగవీటి మోహనరంగా వర్ధంతి అయిన డిసెంబర్ 26న గ్రాండ్ గా కాపునాడు సభ పెట్టాలని నిర్వహాకులు నిర్ణయించారు. ఈ సభకు అన్ని పార్టీల లోని కాపు నేతలకు ఆహ్వానం అని చెబుతున్నారు. ఈ సభ రాజకీయంగా ఎలాంటి సంచలన ప్రకటనలకు కారణం అవుతుందో అన్న ఆసక్తి అయితే ఉంది.
కాపునాడు సభ పోస్టర్ ని మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నాయకులను గంటా కలుస్తూండడంతో కాపునాడుకు వైసీపీ కాపులు వస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. కాపునాడు హడావుడి ఒక వైపు ఉండగానే వైసీపీ వారు ఇండైరెక్ట్ గా లీడ్ చేస్తున్నట్లుగా ప్రచారంలో ఉన్న తూర్పు కాపుల పిక్నిక్ ఇపుడు హైలెట్ అవుతోంది.
తూర్పు కాపుల పిక్నిక్ కాపునాడు మీటింగ్ కి ఒక రోజు ముందు జరగనుంది. ఈ పిక్నిక్ అనకాపల్లిలో జరగనుంది. దీనికి వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమరనాధ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, చింతలపూడి వెంకటరామయ్య, రాష్ట్ర తూర్పు కాపు కార్పోరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ లతో పాటు టీడీపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతిరావులను ఆహ్వానించారు.
ఒక్క రోజు వ్యవధిలో రెండు కాపు మీటింగులు జరగబోతున్నాయి. రాజకీయంగా ఇవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అంటున్నారు.