మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో ఒక్కో పరిణామం వేగంగా చోటు చేసుకుంటోంది. బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తర్వాత మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని కేంద్ర పరిధిలోని అంశమని ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖకు తరలిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది.
అలాగే గతంలో రాజధాని ఎవరి పరిధిలోకి వస్తుందనే విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఏపీ హైకోర్టు ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో గురువారం ఓ కీలక పరిణామం చోటు చేసుకొంది. రాజధాని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. రాజధానికి సంబంధించి తమకు ఎలాంటి పాత్ర, సంబంధం లేదని చాలా స్పష్టంగా ఆ అఫిడవిట్లో తేల్చి చెప్పింది.
అంతేకాదు చట్టసభల్లో సభ్యులు చర్చించి ఆమోదించిన బిల్లులు కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కూడా కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పినట్టు తాజా సమాచారం. దీంతో రాజధాని ఎపిసోడ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైపు నుంచి ఓ స్పష్టత వచ్చినట్టైంది. గత కొంత కాలంగా రాజధాని అంశం తమ పరిధిలోకి రాదని చట్టసభల వేదికగా, అలాగే వెలుపల కూడా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు పదేపదే చెబుతూ వస్తున్నారు. దాన్ని చట్టబద్ధంగా అఫిడవిట్ రూపంలో దాఖలు చేయడం జగన్ సర్కార్కు పెద్ద ఊరటనిచ్చే విషయంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అనే ఉత్కంఠ నెలకొంది.