కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు నవ్వాలో , ఏడ్వాలో కూడా తెలియని స్థితి. కానీ కరోనా చిత్రవిచిత్రాలకు కారణమ వుతోంది. మానవ సమాజానికి కొన్ని శతాబ్దాలకు సరిపడే అనుభవాలను ఇస్తోంది. కరోనా అనుభవాలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఇంకా మున్ముందు ఈ మహమ్మారి ఇంకెన్ని విషాద జ్ఞాపకాలకు కారణమవుతుందో అర్థం కాని పరిస్థితి.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ముఖలింగాపురం పంచాయతీ పాలసింగికి చెందిన ఓ గిరిజన కుటుంబానికి ఎదురైన వింత అనుభవం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. పాలసింగి నివాసైన గిరిజన మహిళ పార్వతి కరోనా బారిన పడింది. దీంతో ఆమెకు వైద్యం అందించేందుకు విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. కొంత కాలంగా ఆమె మూత్రపిండాల సమస్యతో కూడా బాధపడుతోంది. ఇప్పుడు ఆమె అనారోగ్యానికి కరోనా తోడైంది.
ఈ నేపథ్యంలో కోవిడ్ అధికారులు గిరిజన మహిళ పార్వతి ఈ నెల ఒకటో తేదీ చనిపోయారని, కుటుంబ సభ్యుల సమాచారం తెలియక శవ దహనం చేయలేకపోతున్నామని బుధవారం ప్రకటించారు. అయితే ఈ విషాద సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు ఓ ప్రముఖ పత్రికా విలేకరి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో షాక్కు గురి చేసే వింత అనుభవం సదరు జర్నలిస్టుకు ఎదురైంది.
తమ తల్లి బతికే ఉన్నారని, కాసేపటి క్రితమే ఫోన్లో మాట్లాడినట్టు చావు కబురు చల్లగా పార్వతి పిల్లలు చెప్పేసరికి జర్నలిస్టుకు నోట మాట రాలేదు. అంతేకాదు, తమ తల్లితో జర్నలిస్టును మాట్లాడించారు. తాను బతికే ఉన్నానని, వైద్యం అందుతోందని పార్వతి చెప్పడంతో జర్నలిస్టు అవాక్కయ్యాడు. అయితే పార్వతి విషయమై…కోవిడ్ అధికారులను సదరు జర్నలిస్టు వివరణ అడగ్గా, ఆమె చనిపోయినట్టు నిర్ధారించడం అసలు ట్విస్ట్. ఇలాంటివి ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అంతా కరోనా మహత్యం.