‘మా’ ఎన్నిక‌ల నిప్పు ర‌గులుతూ….!

‘మా’ ఎన్నిక‌లు ర‌గిల్చిన నిప్పు ర‌గులుతూనే ఉంది. మున్ముందు కూడా నిప్పు ఆరిపోయేలా క‌న్పించ‌డం లేదు. ‘మా’ ఎన్నిక‌లకు ముందు మంచు విష్ణు, ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ళ్లు శ‌త్రువుల్లా మాట‌ల తూటాలు పేల్చుకున్నారు. సాధార‌ణ రాజ‌కీయ…

‘మా’ ఎన్నిక‌లు ర‌గిల్చిన నిప్పు ర‌గులుతూనే ఉంది. మున్ముందు కూడా నిప్పు ఆరిపోయేలా క‌న్పించ‌డం లేదు. ‘మా’ ఎన్నిక‌లకు ముందు మంచు విష్ణు, ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ళ్లు శ‌త్రువుల్లా మాట‌ల తూటాలు పేల్చుకున్నారు. సాధార‌ణ రాజ‌కీయ పార్టీల నేత‌ల కంటే దారుణంగా తిట్టుకున్నారు. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత అంతా స‌ర్దుబాటు అవుతుంద‌ని భావించారు. కానీ అలాంటి వాతావ‌ర‌ణం క‌రువైంది.

‘మా’ స‌భ్య‌త్వానికి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, ఆ త‌ర్వాత ప్ర‌కాశ్‌రాజ్ రాజీనామా చేశారు. తొంద‌ర‌ప‌డొద్ద‌ని, తానెళ్లి మాట్లాడ్తాన‌ని మంచు విష్ణు ప్ర‌క‌టించారు. దీంతో స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఆశించారు. ఆ త‌ర్వాత మ‌రో ట్విస్ట్‌. ఏకంగా ప్ర‌కాశ్ ప్యాన‌ల్ నుంచి గెలుపొందిన వాళ్లంతా రాజీనామాలు చేసి ట్విస్ట్ ఇచ్చారు. దీనిపై ఇంకా మంచు విష్ణు స్పందించ‌లేదు. కానీ మంచు విష్ణు మ‌ద్ద‌తుదారుడు, త‌న‌కు తాను శ్రీ‌కృష్ణుడిగా అభివ‌ర్ణించుకున్న న‌టుడు న‌రేష్ రెచ్చ‌గొట్టేలా మాట్లాడారు. ఇటీవ‌ల ప్రెస్‌మీట్‌లో ఏడ్చిన ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ స‌భ్యుల్ని ముండ‌మోపులంటూ తీవ్ర దూష‌ణ‌కు దిగారు.

తాజాగా ఎన్నిక‌ల రోజు సీసీటీవీ పుటేజీ కావాల‌ని ఎన్నిక‌ల అధికారి కృష్ణ‌మోహ‌న్‌కు ప్ర‌కాశ్‌రాజ్ లేఖ రాయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎన్నిక‌ల్లో అక్ర‌మాల్లో జ‌రిగాయ‌ని, ర‌ద్దు చేయాల‌ని న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించేందుకే ప్ర‌కాశ్‌రాజ్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా ఎన్నిక‌ల అధికారికి రాసిన లేఖ‌లో మంచు మోహ‌న్‌బాబు, న‌రేష్‌ల‌ను అసాంఘిక శ‌క్తులుగా అభివ‌ర్ణించ‌డంపై ప్ర‌కాశ్ ప్ర‌త్య‌ర్థులు కోపంగా ఉన్నారు.

ఓట‌మి భారంతో కుంగిపోతున్న వారిపై నోరు చేసుకోవ‌డం ఎందుక‌ని ఊరుకున్నామ‌ని, త‌మ‌పై అవాకులు చెవాకులు పేలితే ఇక స‌హించ‌మ‌ని మంచు విష్ణు ప్యాన‌ల్ స‌భ్యులు హెచ్చ‌రిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలా ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ నుంచి క‌వ్వింపు చ‌ర్య‌లు ఆప‌క‌పోతే…. త‌మ స‌త్తా ఏంటో చూపుతామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఎన్నిక‌ల్లోనే కాదు, బ‌య‌ట కూడా మ‌ట్టి క‌రిపించే సామ‌ర్థ్యం త‌మకు ఉంద‌ని మంచు విష్ణు ప్యాన‌ల్ స‌భ్యులు అంటున్నారు. ఎన్నిక‌లు ముగిసి, ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత కూడా ఇరు ప్యాన‌ళ్లు ప‌ర‌స్ప‌రం తేల్చుకోవాల‌నే వైఖ‌రితో ఉండ‌డం టాలీవుడ్‌లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. ‘మా’ ఎన్నిక‌లు రగిల్చిన నిప్పు ఇప్ప‌ట్లో ఆరిపోయేలా లేద‌నే ఆందోళ‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.