రాష్ట్రాల రాజధానుల అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది కేంద్ర హోం శాఖ. ఏపీలో మూడు రాజధానుల అంశంపై హైకోర్టు విచారణలో భాగంగా తాము దాఖలు చేసిన పిటిషన్లో కేంద్రం ఈ స్పష్టత ఇచ్చింది. ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా కొంతమంది హై కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై విచారిస్తూ.. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధి లోనిదా? కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదా? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని హై కోర్టు వివరణ కోరినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేస్తూ.. రాష్ట్రాల రాజధానుల విషయంలో కేంద్ర ప్రమేయం ఉండదని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.
ఇది వరకూ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ తరహాలో స్పందించింది. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఇదే మాటే చెబుతూ వచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా డిసైడ్ చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేదని వాళ్లు చెప్పారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించగా, ఈ విషయం తమ పరిధిలో ఉండదని కేంద్ర ప్రభుత్వం హై కోర్టుకు స్పష్టం చేసింది. రాష్ట్ర చట్టసభలో చర్చించి తీసుకున్న నిర్ణయమే తప్ప రాజధాని అంశంలో తమ జోక్యం ఉండదని పేర్కొంది.
కేంద్రం జోక్యం చేసుకోవాలి.. అంటూ నిన్ననే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. అమరావతిని కేంద్రమే కాపాడాలంటూ ఆయన ఆర్తనాదాలు చేసినంత పని చేశారు. అయితే రాజధాని అంశంపై రాష్ట్రాల ఇష్టమే అని కేంద్రం తన కౌంటర్ పిటిషన్ లో పేర్కొని, ఈ వ్యవహారం నుంచి తప్పుకుంది.