ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కొందరి అభిమానం విపరీత పోకడలకు దారి తీస్తోంది. తమిళనాడు రాజకీయ సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. తమిళనాడులో తమ అభిమాన రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలకు గుడులు, గోపరాలు కట్టించడం చూశాం. ఇప్పుడు అలాంటి ధోరణులు ఏపీలో కూడా కనిపిస్తున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెం వైసీపీ నాయకులు తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏకంగా ఆలయ నిర్మాణం చేపట్టారు. దీనికి వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఇదే రోజు ఆయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడం విశేషం.
ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. పార్టీ నేతల సహకారంతో ఆలయం నిర్మించి, అందులో జగన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయ నున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.
ఇలాంటివి వైసీపీ శ్రేణులకు నచ్చ వచ్చేమో కానీ, జగన్ కూడా హర్షించరు. ఇలాంటివి విపరీత ధోరణులకు నిదర్శనం. మనిషిని మనిషిగా చూస్తేనే గౌరవం, మర్యాద. రాజకీయంగా ఎవరెవరి అభిప్రాయాలు, అభిమానాలు వారి వారి వ్యక్తిగతం. కానీ అవి శ్రుతి మించకూడదు. కానీ రాజంపాలెంలో జగన్ ఆలయాన్ని కట్టాలనుకోవడం ఎలాంటి సంకేతాలు పంపుతాయో వైసీపీ స్థానిక నాయకులు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.