వరుస ఫ్లాపులు.. ఈ కాంపౌండ్ కు ఏమైంది..?

సినిమాల పరంగా మెగా హీరోలది చాలా పెద్ద కాంపౌండ్. అక్కడ సీజన్స్ తో సంబంధం లేదు, ట్రెండ్ తో పని లేదు. మినిమం గ్యాప్ లో ఎవరో ఒకరు హిట్ కొడుతూనే ఉంటారు. అలా…

సినిమాల పరంగా మెగా హీరోలది చాలా పెద్ద కాంపౌండ్. అక్కడ సీజన్స్ తో సంబంధం లేదు, ట్రెండ్ తో పని లేదు. మినిమం గ్యాప్ లో ఎవరో ఒకరు హిట్ కొడుతూనే ఉంటారు. అలా ఆ కాంపౌండ్ నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. సీనియర్ హీరో చిరంజీవి నుంచి నిన్నగాక మొన్నొచ్చిన వైష్ణవ్ తేజ్ వరకు అంతా ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంటారు. నిత్యం బిజీగా ఉంటారు.

ఓవైపు స్టోరీ సిట్టింగ్స్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్, ఇంకోవైపు ఫారిన్ షెడ్యూల్స్.. ఏదీ లేకపోతే మ్యూజిక్ సిట్టింగ్స్.. ఇలా నిత్యం ఆ కాంపౌండ్ లో సినిమా వ్యవహారాలు నిత్యాన్నదానంలా కొనసాగుతూనే ఉంటాయి. ఫ్లాపులు, హిట్స్ కు అతీతం మెగా కాంపౌండ్. ఎందుకంటే, ఓ ఫ్లాప్ ఇలా రావడం ఆలస్యం, షార్ట్ గ్యాప్ లో ఓ హిట్ వస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త తేడాగా ఉంది.

మెగా కాంపౌండ్ నుంచి మినిమం గ్యాప్స్ లో నలుగురు హీరోలొచ్చారు. బాధాకరమైన విషయం ఏంటంటే, నలుగురూ కలిసి మూడు ఫ్లాపులిచ్చారు. దీంతో కాంపౌండ్ కు కాస్త కళ తగ్గింది. సరిగ్గా నెల రోజుల్లో ఈ ఫ్లాపులిన్నీ క్యూ కట్టాయి.

జులై చివర్లో బ్రో సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు పవన్ కల్యాణ్. ఈ సినిమాలో పవన్ తో పాటు మరో మెగా హీరో సాయితేజ్ కూడా నటించాడు. స్వయంగా త్రివిక్రమ్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అందించాడు. ఇలా భారీ సెటప్ తో, భారీ ఎత్తున రిలీజైన బ్రో సినిమా నిరాశపరిచింది. వివాదాల సంగతి పక్కనపెడితే, కంటెంట్ పరంగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.

బ్రో సినిమా వచ్చిన కొద్ది వారాలకే భోళాశంకర్ వచ్చింది. ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. బ్రో బాధల్ని భోళాతో మరిచిపోవచ్చని ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ భోళా బోల్తాకొట్టింది. మొదటి రోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే, చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా ముద్ర వేయించుకుంది భోళాశంకర్.

ఈ రెండు సినిమాల దెబ్బల పరంపర కొనసాగుతున్న టైమ్ లోనే గాండీవధారి అర్జున వచ్చింది. వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా కూడా దెబ్బేసింది. ఫ్యాన్స్ గుండె గుభేల్ మనేలా చేసింది.

ఇలా నెల రోజుల వ్యవధిలోనే 3 ఫ్లాప్స్ చవిచూసింది మెగా కాంపౌండ్. నలుగురు హీరోలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులిచ్చినట్టయింది. దీంతో కాంపౌండ్ కళతప్పింది. ఇలా డల్ గా ఉన్న కాంపౌండ్ కు కాస్తోకూస్తో ఉత్సాహం తీసుకొచ్చిన అంశం ఏదైనా ఉందంటే, తాజాగా బన్నీకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ రావడమే.