రాముడు రాజకీయానికే.. భక్తి కోసం కాదు!

భారతీయ జనతా పార్టీ నాయకులు హిందుత్వవాదాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ ఉంటారు. హిందూమతమే తమ ఓటు బ్యాంకుగా పరిగణించి చెలరేగుతూ ఉంటారు. రాముడిని ఎన్నికల ప్రచారాస్త్రంగా ప్రయోగించి చాలా చాలా లాభపడ్డారు. రాబోయే 2024…

భారతీయ జనతా పార్టీ నాయకులు హిందుత్వవాదాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ ఉంటారు. హిందూమతమే తమ ఓటు బ్యాంకుగా పరిగణించి చెలరేగుతూ ఉంటారు. రాముడిని ఎన్నికల ప్రచారాస్త్రంగా ప్రయోగించి చాలా చాలా లాభపడ్డారు. రాబోయే 2024 ఎన్నికలలో కూడా రాముడిని తమ ఎన్నికల ప్రచారానికి వాడుకోబోతున్నారు. 

రాముడు వారికి రాజకీయ ప్రచారాస్త్రమే తప్ప రాముడి పట్ల వారికి భక్తి ఉన్నదని అనుకుంటే పొరపాటు! హిందూ మతాన్ని అడ్డగోలుగా వాడుకున్నంత మాత్రాన బిజెపి నాయకులందరూ అతి గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరులని అనుకుంటే కూడా పొరపాటు. ఆ విషయాన్ని అమిత్ షా ఇప్పుడు తన చర్యలతో నిరూపించబోతున్నారు.

ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించడానికి వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గన్నవరం విమానాశ్రయం నుంచి తొలుత భద్రాచలం వెళ్తారని.. అక్కడి రాముల వారి దర్శనం తర్వాత ఖమ్మం వచ్చి బహిరంగ సభలో పాల్గొంటారని తొలుత కార్యక్రమాన్ని నిర్ణయించారు. అయితే రేపు అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు అనగా.. ఇప్పుడు కార్యక్రమంలో మార్పు చేర్పులు చేశారు. భద్రాచలం పర్యటన రద్దు చేశారు. కేవలం ఖమ్మం బహిరంగ సభలో మాత్రమే పాల్గొంటారుట. ఎందుకంటే భద్రాచలంలో రాములవారిని దర్శించుకోవడానికి అవసరమైన అంత ఖాళీ సమయం అమిత్ షా దగ్గర లేదుట!

అమిత్ షా గన్నవరం నుంచి భద్రాచలానికి కాలినడకన ఏమీ వెళ్లడం లేదు. హెలికాప్టర్లో భద్రాచలం వెళ్లి మళ్లీ హెలికాప్టర్ లోనే ఖమ్మం చేరుకుంటారనేది షెడ్యూలు ప్రకారం నిర్ణయం. మహా అయితే మధ్యలో ఒక గంట వ్యవధి భద్రాచలం ఆలయంలో గడిపే వారేమో. దేవుడి కోసం ఆ మాత్రం సమయం తన వద్ద లేదని ముందుగా ప్రకటించిన కార్యక్రమాన్ని మార్చుకోవడం అనేది రాముడి భక్తులకు బాధ కలిగిస్తోంది.

అమిత్ షా కు జూనియర్ ఎన్టీఆర్ ను కలవడానికి, రామోజీరావును కలవడానికి సమయం ఉంటుంది గానీ రాముడిని దర్శించుకోవడానికి సమయం ఉండదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రామోజీరావు తో గడిపినంత సమయం కూడా రాముడు కోసం ఆయన వెచ్చించలేరా అనేది ప్రశ్న. 

రామోజీరావు రాజకీయంగా తమకు ఉపయోగపడతాడని మాత్రమే కలుస్తుండవచ్చు. అయోధ్య రాముడిని బ్రహ్మాస్త్రంగా ఎన్నికల మీద ప్రయోగిస్తున్నప్పుడు.. ఇక భద్రాచల రాముడి అవసరం తమకు లేదని చిన్నచూపు చూస్తున్నారా అని కూడా ప్రజలు విమర్శిస్తున్నారు.