తిరుపతిలో పవన్‌కల్యాణ్ ఎన్నికల పాదయాత్ర, అనంతరం సభ సక్సెస్ అయ్యాయి. దీంతో బీజేపీ-జనసేన శ్రేణుల ఆనందానికి అవధుల్లే కుండా పోయింది. తిరుపతిలో పవన్ ఎన్నికల ప్రచార పర్యటన సక్సెస్ కావడంపై ఆ రెండు పార్టీల కంటే ఒక ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఖుషీగా ఉంది. మరో ప్రత్యర్థి పార్టీ టీడీపీ ఆందోళన చెందుతోంది. తమ ఓటు బ్యాంకుకు బీజేపీ-జనసేన గండికొడుతుం దనే భయం టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రధానంగా నిన్నటి పవన్ పర్యటన అంతా వైసీపీ కోరుకున్నట్టుగా సాగిందని చెప్పక తప్పదు. పవన్ పర్యటన సక్సెస్ కావడానికి వెనుక ఆయన సామాజిక వర్గం గట్టిగా పని చేసింది. ఇటీవల తిరుపతి పార్లమెంట్ పరిధిలోని బలిజలు చంద్రగిరిలో సమావేశమై, జనసేనకు టికెట్ ఇవ్వకపోతే నోటాకు వేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ కలవర పాటుకు గురైంది.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో జనసేన నేతలు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం బీజేపీని సహజంగానే ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రచారానికి రావడంతో పాటు తన సామాజిక వర్గం ఓట్లను బీజేపీకి వేసేలా తెలివిగా మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ అసలు విషయాన్ని సభ ముగింపులో మాట్లాడ్డం హైలెట్‌గా చెప్పొచ్చు. తిరుమలలో బలిజలను వేధిస్తున్నారని, జగన్ ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. బలిజలు సాదాసీదా జీవనం సాగించేవాళ్లని, తిరుమలలో టెంకాయలు, ఇతరత్రా చిన్నచిన్న వస్తువులను అమ్ముకుంటూ జీవనం సాగించే వాళ్లను వేధించడం మంచిది కాదని హెచ్చరించారు.
బలిజలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీంతో బలిజలను తన వైపు ఆకర్షించుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. తిరుపతిలో మెజార్టీ బలిజలు మొదటి నుంచి టీడీపీ వైపే ఉన్నారు.
తాజా రాజకీయ పరిస్థితుల్లో పవన్‌కల్యాణ్ మాటను ఆయన సామాజిక వర్గానికి చెందిన మెజార్టీ బలిజలు వేదవాక్కుగా భావిస్తారు. ముఖ్యంగా బలిజ యువత పెద్ద ఎత్తున పవన్ వెంట నడుస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో బలిజలు తమ వైపు నిలుస్తారో లేదో అని అనుమానిస్తున్న బీజేపీ …నిన్నటి పవన్ సభతో ఊపిరి పీల్చుకుంది.
మరోవైపు తమ ప్రధాన ప్రత్యర్థి టీడీపీకి పడాల్సిన ఓట్లన్నీ బీజేపీ -జనసేన కూటమి అభ్యర్థికి దక్కుతుండడంపై వైసీపీ ఆనం దంగాఉంది. నిన్నటి పవన్ పర్యటనతో బీజేపీ -జనసేన కూటమి అభ్యర్థికి ఓట్లు పెరగడంతో పాటు టీడీపీకి భారీగా గండికొట్టే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ ప్రచారం కేవలం బీజేపీ -జనసేన కూటమికే కాదు, వైసీపీకి కూడా పరోక్షంగా లాభం చేకూర్చుతుండడం విశేషం.