గులాబీపై రగులుతున్న పచ్చమాజీ మంత్రులు!

ఒకప్పట్లో వారందరూ కూడా కేసీఆర్ తో సమానంగా, కొండొకచో ఆయనకంటె ఉన్నతంగా వైభవం వెలగబెట్టిన నాయకులు. కానీ.. ఓడలు బండ్లు కావడంతో వారికి గడ్డు రోజులు ప్రాప్తించాయి. కేసీఆర్ పంచన చేరి.. తమ రాజకీయ…

ఒకప్పట్లో వారందరూ కూడా కేసీఆర్ తో సమానంగా, కొండొకచో ఆయనకంటె ఉన్నతంగా వైభవం వెలగబెట్టిన నాయకులు. కానీ.. ఓడలు బండ్లు కావడంతో వారికి గడ్డు రోజులు ప్రాప్తించాయి. కేసీఆర్ పంచన చేరి.. తమ రాజకీయ జీవితాన్ని కొనసాగించవలసిన ఆగత్యం ఏర్పడింది. అయితే.. ఇప్పుడు వారంతా కేసీఆర్ మీద అలక పూనుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్.. వాళ్లలో ఎవ్వరికీ అవకాశం ఇవ్వకపోవడమే అందుకు కారణం. 

తుమ్మల నాగేశ్వరరావు సంగతి ఆల్రెడీ బయటపడింది. తెలుగుదేశం చంద్రబాబు హవా వర్ధిల్లిన రోజుల్లో తెలంగాణ నుంచి కేసీఆర్ కంటె ప్రాబల్యం ఉన్న నాయకుడిగా తుమ్మలకు గుర్తింపు ఉంది. అలాంటి తుమ్మల భారాసలో చేరిన తర్వాత.. ఆ ప్రాధాన్యాన్ని కోల్పోయారు. పాలేరు నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. ఆయనను పార్టీ పట్టించుకోలేదు. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉండి, తర్వాత రాజకీయంగా అసంతృప్తి ప్రకటించగానే గులాబీ పెద్దలు ఆయనను బుజ్జగించారు. కానీ, చివరకు అభ్యర్థుల జాబితా వచ్చేసరికి రిక్తహస్తమే ఎదురైంది. ఇప్పుడు ఆయన అలిగి పార్టీనుంచి బయటకు వెళుతున్నారు. పాలేరు నుంచి పోటీచేయడం ఖరారు అని ప్రకటించేశారు. ఏ పార్టీలోకి వెళతారనేది మాత్రం ఇంకా తేల్చి చెప్పలేదు.

తెలుగుదేశం పార్టీకే చెందిన మరో మాజీ మంత్రి క్రిష్ణయాదవ్. ఎన్టీఆర్ కాలంనుంచి తెలుగుదేశంలో కీలకనేతగా ఎదిగిన క్రిష్ణయాదవ్, కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా తనకు నిరాశ కలిగించిందని అన్నారు. అందుచేతనే భారాస పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. బహుశా ఆయన టికెట్ ఆశించారేమో తెలియదు గానీ.. ఆ సంగతి చెప్పకుండా, బీసీలకు న్యాయం చేయలేదని, భూస్వాములకు పెత్తందార్లకే పెద్దపీట వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 

మరో మాజీ మంత్రి కూడా ఉన్నారు. ఆయన మోత్కుపల్లి నర్సింహులు. గత ఎన్నికల్లో ఇండిపెండెంటుగా పోటీచేసి భంగపడిన మోత్కుపల్లి, తర్వాత భారాసలో చేరారు. అయినా అక్కడ దక్కిందేమీ లేదు. ఇప్పుడు జాబితా వచ్చిన తర్వాత ఆయన కూడా కేసీఆర్ మీద ఆగ్రహంగానే ఉన్నారు. 

చంద్రబాబునాయుడును నమ్ముకుని.. 2014 తర్వాత కేంద్రంలోని ఎన్డీయేలో తెలుగుదేశం భాగస్వామి గనుక.. తనకు గవర్నరు పదవి ఇప్పించాల్సిందిగా.. మోత్కుపల్లి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే చంద్రబాబు కనికరించలేదు. అలిగి, తెలుగుదేశం నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ మీద కూడా అలకపూనుతున్నారు. 

నిజం చెప్పాలంటే.. అలకపూనడం లేదుగానీ.. కేసీఆర్ పంచన చేరి లూప్ లైన్ లోకి వెళ్లిపోయిన తెలుగుదేశం మాజీ మంత్రులు మరికొందరు కూడా ఉన్నారు. ఎంతో సౌమ్యుడిగా పేరున్న మండవ వెంకటేశ్వరరావు వీరిలో ఒకరు. అయితే ఆయన క్రియాశీల రాజకీయాలకే దూరంగా ఉన్నారు. 

ఇప్పుడు అలకపూనిన పచ్చ మాజీ మంత్రులు గులాబీపై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. ఏం సాధిస్తారోర మరి!