ఫ్యాషన్‌గా మారిన టీటీడీపై విమర్శలు!

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)పై  కొన్ని సంస్థలు, పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలు చేయడాన్ని బాధ్యత గల వ్యక్తులు స్వాగతించాలి. అయితే అవి స‌ద్విమ‌ర్శ‌లైతే స్వాగతించాలి.…

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)పై  కొన్ని సంస్థలు, పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలు చేయడాన్ని బాధ్యత గల వ్యక్తులు స్వాగతించాలి. అయితే అవి స‌ద్విమ‌ర్శ‌లైతే స్వాగతించాలి. స్వాగతిస్తామని అధికారంలో ఉన్నవారు అంటుంటారు. కానీ అధికార పార్టీ స్వాగతించే సద్విమర్శలు ఆచరణలో సాధ్యం కాదు. అవసరం కూడా లేదు. అదే సమయంలో టీటీడీ వ్యవహారంలో  కొందరు చేస్తున్న విమర్శలు ఒక ఫ్యాషన్‌గా మారాయి. ఈ పరిణామం మంచిది కాదు.

తాజాగా 24 మందితో నూత‌న పాల‌క మండ‌లిని ప్రభుత్వం నియమించింది. పాలకమండలి సభ్యుల నియామ‌కాన్ని ఏపీ ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం అంటేనే రాజకీయ పార్టీ నాయకత్వంలో పని చేసేది. అలాంటప్పుడు టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చార‌ని రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం ఫ్యాషన్ కాకపోతే మ‌రేంటి?నియమితులైన‌ సభ్యులలో వివాదాస్పద వ్యక్తులు ఉంటే వ్యతిరేకించాలి. ప్రస్తుత బోర్డులో ఇద్దరు ముగ్గురు సభ్యుల నియామకం విషయంలో విమర్శలు వస్తున్నాయి. అలాంటి వారిని నియమించే విషయంలో ప్రభుత్వం జాగ్ర‌త్త వహించి ఉండాల్సిన అవసరం ఉంది.

ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం కచ్చితంగా స్వాగతించాలి. ప్రభుత్వం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. విచిత్రంగా వారు రాజకీయ నాయకులు కాదు. అలాంట‌ప్పుడు రాజకీయ పునరావాస కేంద్రం అనడం ఎందుకు? ఫ్యాషన్ కాకపోతే!రాజకీయ ప్రభుత్వం జోక్యం చేసుకుని దేవాలయాలు దేశంలో ఎలా పని చేస్తున్నాయో వాటిని పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు. వ్యక్తుల చేతుల్లో నడుస్తున్న దేవాలయాలతో పోల్చుకుంటే టీటీడీ 100 రేట్లు మెరుగ్గా ఉంది.

బీజేపీకి విమర్శించే అర్హత ఉందా ?

పదే పదే ఇలాంటి విమర్శలు చేస్తున్నది బీజేపీ. టీటీడీ ప్రస్తుత బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందంటున్న  బీజేపీ అదే బోర్డులో 24 మందికి గాను అరడజను మంది సదరు పార్టీ సిఫార్సుతో వచ్చారని విమర్శలపై ఏమంటుంది? ఇది ఔనా? కాదా? బీజేపీ నిజాయ‌తీగా వాస్తవాలు చెప్పాలి. ఒక వైపు ఏ అధికారం లేకుండా అరడజను మందిని సిఫార్సు చేసిన సదరు పార్టీ నియామక అధికారం కలిగిన పార్టీ పై విమర్శలు చేయ‌డం గ‌మ‌నార్హం. బోర్డులో రాజకీయ నాయకులు కాకుండా ఆధ్యాత్మిక వేత్తలు ఉండాలి అంటున్న బీజేపీ తాము సిఫార్సు చేసిన వారిలో ఎందరు ఆధ్యాత్మిక వేత్తలు ఉండారో చెప్పాలి.

ఒక ప్రజాప్రతినిది ఏకంగా టీటీడీ చైర్మన్ తన ఎన్నికల అఫిడ‌విట్ లో తాను క్రిస్టియ‌న్‌ అని డిక్లరేషన్ ఇచ్చారన్నారు. ఇలాంటి విమ‌ర్శ‌లు చేసే నాయ‌కుల‌ విశ్వాసం ఏమిటంటే ప్రజలు అఫిడ‌విట్ చూడ‌ర‌నే  ధీమా. అసలు ఎన్నికల అఫిడ‌విట్ లో మత ప్రస్తావన ఉంటుందా? ప్రజలకు తెలియదు కాబట్టి ఏమైనా చెప్పవచ్చు. టీటీడీలో ఈఓ గా పని చేసిన ఓ అధికారి ఈ విషయం మీద స్పందిస్తూ అన్యమతస్తులు డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి అంటారు. 

శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఇతర మ‌త‌స్తులు అయితే శ్రీవారి పై నమ్మకం ఉందని సంతకం చేయాలి. కానీ చైర్మన్ గా నియమితులైన‌ వారికి అవకాశం లేదు. ఎందుకంటే హిందువు కానీ వారు చైర్మన్ కాదు కదా… 2007 తర్వాత సాధారణ ఉద్యోగానికి కూడా  అర్హులు కాదు. ఆ చట్టం తీసుకొచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి తాను ఎన్నికల అఫిడ‌విట్‌లో క్రిస్టియన్ అని పేర్కొని టీటీడీ చైర్మన్ ఎలా అవుతారు? ఈ మాత్రం కూడా పరిశీలించకుండా చైర్మన్ మీద విమర్శలు చేయడం రాజకీయం అందామా? ఫ్యాషన్ అనాలా?

టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో గాని రోజు వారీ పాలన ముఖ్యంగా భక్తుల వసతి సౌకర్యాలు, ద‌ర్శ‌నాల ఏర్పాటు లాంటి అంశాలలో ఎలాంటి తప్పులు జరిగినా బోర్డు ,దాన్ని నియమించిన ప్రభుత్వంపై ఖచ్చితంగా విమర్శలు చేయాలి. హేతుబద్ధ విమర్శల‌పై అధికార యంత్రాంగం స్పందించి దిద్దుబాటు చర్యలు చేప‌ట్టాలి. ప్రజలకు సమాచారం ఉండదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడితే చెల్లిపోతుందనుకుని టీటీడీపై ఫ్యాషన్‌గా విమర్శలు చేస్తే ప్రయోజనం శూన్యం. ఇలాంటి విమర్శలు చేస్తే రేపు నిజం చెప్పినా భక్తులు నమ్మరు. 

సంచలనాల కోసం విమర్శలు చేసే వారు ఉన్న నేపథ్యంలో టీటీడీ అధికార యంత్రాంగం  నిత్యం అప్ర‌మ‌త్తంగా వ్యవహరించాలి. ప్రభుత్వం కూడా తనవైపు నుంచి తీసుకునే విధానపరమైన అంశాలపై విమర్శలకు తావు లేకుండా నిర్ణయాలు ఉండాలి. తప్పులు దొర్లితే సరిదిద్దుకోవాలి. ఈ సంప్రదాయం ఈ బోర్డు నుంచే జరిగితే అందరికీ మంచిది.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, తిరుప‌తి