ఊహూ…డైలాగ్ పేల‌లేదు

ఆప‌రేష‌న్ స‌క్సెస్‌, బ‌ట్ పేషెంట్ డెడ్ అన్న చందంగా తిరుప‌తిలో ప‌వ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం సాగింది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌ధాన టార్గెట్ వైసీపీ. దాని మిత్రం బీజేపీ టార్గెట్ టీడీపీ. అయినా ఇద్ద‌రు క‌లిసి…

ఆప‌రేష‌న్ స‌క్సెస్‌, బ‌ట్ పేషెంట్ డెడ్ అన్న చందంగా తిరుప‌తిలో ప‌వ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం సాగింది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌ధాన టార్గెట్ వైసీపీ. దాని మిత్రం బీజేపీ టార్గెట్ టీడీపీ. అయినా ఇద్ద‌రు క‌లిసి పొత్తు పెట్టుకున్నారు. తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక బ‌రిలో ర‌త్న‌ప్ర‌భ‌ను నిలిపారు. తిరుప‌తి లోక్‌స‌భ స్థానం అధికార పార్టీ వైసీపీది. ఆ పార్టీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ ఆక‌స్మిక మృతితో ఉన ఎన్నిక అనివార్య‌మైంది.

ఈ నేప‌థ్యంలో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. అభ్య‌ర్థి ఎంపిక‌లో బీజేపీ, జ‌న‌సేన పార్టీలు చివ‌రి వ‌ర‌కూ జాప్యం చేస్తూ వ‌చ్చినా, చివ‌రికి ఐఏఎస్ అధికారి ర‌త్న‌ప్ర‌భను ఎంపిక చేశారు. త‌న సూచ‌న మేరకే ర‌త్న‌ప్ర‌భ‌ను బీజేపీ బ‌రిలో నిలిపింద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిన్న‌టి స‌భ‌లో చెప్పారు.

ఇదిలా ఉండ‌గా తిరుప‌తి స‌భ‌లో అధికార పార్టీ వైసీపీపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ విరుచుకుప‌డ్డారు. మ‌రో ప్ర‌త్య‌ర్థి పార్టీ టీడీపీపై మాట‌మాత్రం కూడా ఆయ‌న మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను కాకుండా, మ‌తం పేరుతో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం ఆక‌ట్టుకోలేక‌పోయింది. జ‌గ‌న్‌పై మ‌తం బుల్లెట్ పేల‌లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

‘తిరుపతిలో ఓటు అడిగేందుకు వచ్చే వైసీపీవాళ్లను ఒకటే అడగండి. 150కి పైగా ఆలయాలు కూల్చారు. రాముడి తల నరికే శారు. ఈ రోజుకీ దోషులను పట్టుకోలేక పోయారు. ఏముఖం పెట్టుకుని ఓటు అడుగుతారని నిలదీయండి. వెంకన్నను కొలిచే నేల ఇది. వైసీపీకి ఓటు వేస్తే ఏడుకొండలవాడికి ద్రోహం చేసినట్టే. దేవాలయాలను కూల్చేవారిని ప్రోత్సహిం చినట్టే’ అని ప‌వన్‌క‌ల్యాణ్ బీజేపీ మ‌న‌సెరిగి వైసీపీ ప్ర‌భుత్వంపై మ‌తం సెంటిమెంట్‌ను రెచ్చ‌గొట్టేందుకు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

కానీ ఏపీకి ద్రోహం చేసిన‌, చేస్తున్న పార్టీగా బీజేపీని జ‌నం చూస్తున్నారు. ప‌వ‌న్ మాట‌ల్లో చెప్పాలంటే వెంకన్నను కొలిచే నేల సాక్షిగా, తిరుప‌తిలో క‌లియుగం దైవం పాదాల చెంత ఏపీకి ఐదేళ్లు కాదు ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని నాడు ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మోడీ  హామీ ఇచ్చారు. ఆ స‌భ‌లో ఇదే ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా ఉన్నారు.

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డం, అలాగే ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీకంగా, ప‌దుల సంఖ్య‌లో ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించ‌డంపై ప‌వ‌న్ ఏ మాత్రం ప్ర‌స్తావించక‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. మ‌తం అనేది బీజేపీ -జ‌న‌సేన ఎన్నిక‌ల ఆయుధం కావ‌చ్చు. కానీ జ‌నానికి మ‌తం కంటే మ‌నుగ‌డ ముఖ్యం. 

మనిషి మ‌నుగ‌డ సాగించాలంటే ఉపాధి ముఖ్యం. ప్ర‌త్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చి వేలాది మందికి ఉపాధి ల‌భించేద‌ని జ‌నం న‌మ్ముతున్నారు.అలాగే విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రిస్తూ, ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీస్తోంద‌ని బీజేపీపై జ‌నం ఆగ్ర‌హంగా ఉన్నారు. వెనుక‌బ‌డిన రాయ‌ల‌సీమ‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వ‌కుండా మోసం చేసింద‌ని ఆ ప్రాంత ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. 

ఇలా అనేక స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిన బీజేపీనే, స‌మ‌స్య‌గా మారడంపై జ‌నం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. బీజేపీ మోసాల‌ను క‌ప్పి పెట్టేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నించినా, జ‌నానికేమీ మ‌తిమ‌రుపు లేద‌ని గ్ర‌హించి వాస్త‌వాలు మాట్లాడి ఉంటే బాగుండేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.