ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వరుస ఇంటర్వ్యూలతో కాస్త హడావిడి చేస్తున్నారు సోము వీర్రాజు. చంద్రబాబు ఏజెంట్ కన్నాలా కాకుండా సొంతంగా బీజేపీకి ఊపిరిలూదే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు కూడా ఆశపడ్డారు. కానీ అంతలోనే ఆయన ఎంత చిల్లరగా మాట్లాడతారో అర్థమైపోయింది. ఓ న్యూస్ ఛానెల్ లైవ్ డిబేట్ లో ఏపీ రాజధానుల గురించి వెటకారమాడారు వీర్రాజు.
టీడీపీలాగా ఒకే రాజధాని, వైసీపీలాగా మూడు రాజధానులు తాము పెట్టబోమని, జిల్లాకు ఒక రాజధాని చొప్పున ఏపీకి 13 రాజధానులు ఏర్పాటు చేస్తామని సెలవిచ్చారు వీర్రాజు. బీజేపీ నేతగా, ఓ సాధారణ ఎమ్మెల్సీగా ఆయన ఇలా మాట్లాడితే ఎవరూ పట్టించుకోరు. కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వీర్రాజు ఇలాంటి సిల్లీ కామెంట్ చేయడం మరీ విచారకరం. ఏపీలో ఎలాగూ తమకు అధికారం రాదు అనే ధైర్యంతోనే ఆయన 13 రాజధానుల గురించి మాట్లాడినట్టుంది.
పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తొలిరోజే 2024లో అధికారం మాదే, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి సీఎం అవుతారంటూ గొప్పగా చెప్పిన వీర్రాజు… ఇప్పుడిలా కామెడీ చేసి తన సీరియస్ నెస్ ను, సీనియారిటీని తానే తగ్గించుకున్నారు. పోనీ జనసేన కూడా 13 రాజధానులకి ఒప్పుకుంటుందా? పవన్ కల్యాణ్ మనసులో మాట కూడా ఇదేనా? ఈ విషయంపై కూడా వీర్రాజు ఓ మాట అనేస్తే సరిపోయేది.
రాజధాని వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా ఉన్న వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలా మాట్లాడ్డం సరికాదంటున్నారు నెటిజన్లు. వీర్రాజు వ్యాఖ్యలపై అప్పుడే ట్రోలింగ్ మొదలైంది. ఇలా ట్రోలింగ్ చేసేవాళ్లలో జనసైనికులు కూడా ఉండటం గమనార్హం. ప్రజల మనోభావాలను గౌరవించకుండా రాజధానులపై వెటకారమాడటం ఎవరికీ నచ్చలేదు.
ఏపీకి 13 రాజధానులు వద్దు, బీజేపీకి అధికారం అసలే వద్దు అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి కామెడీలు చేస్తే ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత దిగజారిపోవడం ఖాయం, బీజేపీ పంచన చేరినందుకు జనసేన కూడా మూల్యం చెల్లించుకోవడం అంతకంటే ఖాయం.