ఈ నెల 28న చిత్తూరు జిల్లా నగరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. బటన్ నొక్కి విద్యాదీవెన లబ్ధిదారులకు డబ్బు జమ చేయనున్నారు. ఎన్నికల వేళ నగరికి జగన్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. నగరిలో రోజాకు టీడీపీ కంటే సొంత పార్టీ నేతలతోనే రాజకీయంగా ప్రమాదం పొంచి వుంది. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో రోజాకు వ్యతిరేకంగా ఒక నాయకుడు పని చేస్తున్నాడు.
రోజాను వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలందరికీ సొంత పార్టీకి చెందిన పెద్ద నాయకులే అండగా నిలబడడం తీవ్ర చర్చనీయాంశమైంది. రోజాను వ్యతిరేకిస్తే చాలు… వారికి పనులు చకచకా జరిగిపోతున్నాయి. రోజా వ్యతిరేక వర్గీయులను ఆర్థికంగా బలోపేతం చేయడం వెనుక ఆమెను ఓడించే పథక రచన సాగుతోంది. నగరిలో తనకు వ్యతిరేక రాజకీయాలు సాగుతున్న తీరు, వారికి అండదండలు ఇస్తున్న నేతల గురించి ఇప్పటికే సీఎంకు రోజా ఏకరువు పెట్టినట్టు సమాచారం.
అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పైగా రోజాను వ్యతిరేకిస్తున్న నేతలకు ప్రభుత్వ నుంచి వివిధ రూపాల్లో ఆర్థిక వనరులు పుష్కలంగా దక్కేలా పనులు కట్టబెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం నగరి పర్యటనలో ఇలాంటి వారికి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారా? లేక ఆయన కూడా వారిని భుజం తట్టి ప్రోత్సహిస్తారా? అనే చర్చకు తెరలేచింది. జగన్కు కొన్ని తెలిసి, కొన్ని తెలియకుండా రోజా ఓటమికి పెద్ద కుట్రే జరుగుతోంది.
ఇప్పటికైనా నగరిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించి, అసమ్మతి వర్గీయుల ఆట కట్టించకపోతే మాత్రం… భవిష్యత్లో రోజా ఓటమిని కళ్లారా చూసి ఆనందించవచ్చనే టాక్ వినిపిస్తోంది. జగన్ వచ్చి బటన్ నొక్కడంతో తన బాధ్యత తీరిపోయిందని అనుకుంటే మాత్రం రాజకీయంగా ఆయనకు నష్టమే. నగరిలో వాస్తవ పరిస్థితులను లోతుగా తెలుసుకుని, రోజాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తే వైసీపీకి లాభం.