లేడీ సూపర్ స్టార్ నయనతారను అనుష్క ఫాలో అవుతోందా? కొన్నేళ్లుగా నయనతార పాటిస్తున్న పద్ధతిని, ఇప్పుడు అనుష్క కూడా అనుసరించబోతోందా? ప్రస్తుతం కనిపిస్తున్న సీన్ చూస్తే నిజమే అనిపిస్తోంది. ఇంతకీ ఏంటా మేటర్?
తను నటించే సినిమాలకు నయనతార ప్రచారం చేయదు. ఇప్పుడు అనుష్క కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. అనుష్క తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా ఇది. ఇందులో అనుష్కది కేవలం హీరోయిన్ పాత్ర కాదు. హీరోకు సమానంగా, ఇంకా చెప్పాలంటే హీరో కంటే కాస్త ఎక్కువ వెయిట్ ఉన్న పాత్ర.
ఇలాంటి సినిమాకు ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదు అనుష్క. గడిచిన 4 రోజులుగా నవీన్ ఒక్కడే ఊళ్లన్నీ చుట్టేస్తున్నాడు. అనుష్క ఇల్లు దాటి బయటకు రావడం లేదు.
బయటకు రాకపోవడానికి కారణం ఇదేనా..?
కొన్నేళ్లుగా అనుష్క వెయిట్ ఇష్యూస్ తో బాధపడుతోంది. దీనికి సంబంధించిన కథనాలు మాత్రమే కాదు, ఫొటోలు కూడా బయటకొస్తూనే ఉన్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టైమ్ కు ఆమె స్లిమ్ అవుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదని తెలుస్తోంది. పెరిగిన బరువును అనుష్క తగ్గించుకోలేకపోతోందట.
సినిమాలో ఫిజిక్ ను గ్రాఫిక్స్ తో మేనేజ్ చేయొచ్చు. చాలామంది హీరోలు, హీరోయిన్లు చేస్తున్నదే. కానీ ప్రమోషన్స్ లో ఈజీగా దొరికిపోతారు. అందుకే తన బొద్దు ఫిజిక్ తో బయటకు రావడానికి అనుష్క ఇష్టపడడం లేదని సమాచారం.
ప్రేక్షకుల్లో అనుష్కకు క్రేజ్ ఉన్న మాట వాస్తవం. అలా అని ప్రచారం కూడా చేయకపోతే ఎలా? ఇప్పుడు అనుష్క ముందు ఉన్న దారి ఒకటే. ఆమె ఎలా ఉన్నా బయటకు రావాల్సిందే. లేదంటే ఆమెపై మరిన్నిఊహాగానాలు చెలరేగడం ఖాయం.