ఇండియాలో ఇక కష్టమే అనే అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి చైనీ కంపెనీలు! ఇప్పటికే కొన్ని సంస్థలు తమ యాక్టివిటీస్ ను ఆపేసుకున్నాయి. తాజాగా ఇండియాలో అత్యంత భారీ బిజినెస్ ను చేసుకుంటున్న స్మార్ట్ ఫోన్ సంస్థలు కూడా వెనక్కు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఉద్యోగుల తీసివేతకు రంగం సిద్ధం చేసిందట హువాయ్. స్మార్ట్ ఫోన్, టెలికాం రంగాలకు సంబంధించి డివైజ్ ల తయారీ ద్వారా హువాయ్ ఇండియాలో భారీ బిజినెస్ చేసుకుంటూ వచ్చింది. భారీగా ఆదాయాన్ని గడించింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇండియా నుంచి ఆదాయం తగ్గిపోతుందని ఆ సంస్థ తన తాజా అంచనాల్లో పేర్కొందట. అదే సమయంలో ఇక్కడ ఉద్యోగుల తీసివేతకు కూడా ఆ సంస్థ రంగం సిద్ధం చేసినట్టుగా ఇటీవలే వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా 'వివో' కూడా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి ఆ సంస్థ వైదొలిగింది! వాస్తవానికి చైనీ కంపెనీలపై ఇండియాలో నిషేధం అన్నప్పుడే.. చాలా మంది దెప్పి పొడిచారు. ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి వివోను తొలగించే దమ్ముందా? అని ప్రశ్నించారు. అందుకు తగ్గట్టుగా బీసీసీఐ కూడా ఆ విషయంలో కిమ్మనలేదు. ఏడాదికి 400 కోట్ల రూపాయలకు పై మొత్తంతో ఉన్న ఒప్పందం అది. దాంతో.. వివోను వదిలించుకోవడానికి బీసీసీఐ రెడీ అనలేదు!
కానీ.. అనూహ్యంగా వివోనే ఆ ఒప్పందం నుంచి వైదొలగినట్టుగా తెలుస్తోంది. ఇండియాలో చైనీ వ్యతిరేకత నేపథ్యంలో తమ బోటి సంస్థలపై ఆ ప్రభావం పడుతుందని వివో కు స్పష్టం అయినట్టుగా ఉంది. ఇప్పటికే కరోనా- లాక్ డౌన్ నేపథ్యంలో ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ పడిపోయింది. ఈ పడిపోవడంలో కూడా చైనా కంపెనీల పరిస్థితి మరింత దెబ్బతిందని గణాంకాలు చెబుతున్నాయి. చైనా ప్రోడక్ట్స్ ను కొనకూడదనే చాలా మంది భారతీయుల్లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఇండియాలో ఇక భారీ పెట్టుబడులకు అవి వెనుకడుగు వేస్తున్నట్టుగా ఉన్నాయి. అందులో భాగంగానే ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి కూడా వివో వైదొలిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ ఏడాదికి మాత్రమేనట!
బహుశా వచ్చే ఏడాది నాటికి ఇండియన్స్ మళ్లీ చైనా కంపెనీలను మునుపటి స్థాయిలోనే ఆదరిస్తారనేది ఆ సంస్థ నమ్మకం కాబోలు. కాస్త వేడి తగ్గితే పరిస్థితి సానుకూలంగా మారుతుందనే ఆశాభావం కాబోలు. అందుకే.. బీసీసీఐతో పూర్తిగా ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదట. ఈ ఒక్క ఏడాదికీ రద్దు చేసుకుని, అన్నీ కుదిరితే వచ్చే ఏడాది నుంచి మళ్లీ ఐపీఎల్ ను స్పాన్సర్ చేస్తుందట ఈ స్మార్ట్ ఫోన్ సంస్థ! వేడి తగ్గడం కోసమే చైనా కంపెనీలు ఎదురుచూస్తున్నట్టున్నాయ్!