జోగినాయుడితో విడాకులు అయిపోయిన తర్వాత యాంకర్ ఝాన్సీ పెళ్లి చేసుకోబోతోదంటూ ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ పుకార్లు విని ఝాన్సీ కూడా విసుగెత్తిపోయింది. తాజాగా తన పెళ్లిపై మరోసారి చిన్నపాటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ యాంకరమ్మ కమ్ నటి. తన పెళ్లిపై జనాలు ఆల్రెడీ చాలా అనేసుకున్నారని, ఇప్పుడు తను కొత్తగా చెప్పేదేం లేదంటోంది.
“ప్రేక్షకులు నా పెళ్లికి సంబంధించి వందల రకాలుగా సమాధానాలు వాళ్లకు వాళ్లే చెప్పుకున్నారు. వాళ్ల బుర్రల్లో వాళ్ల రీల్స్ వాళ్లు తిప్పేసుకున్నారు. మైండ్ లో బొమ్మలు వేసుకొని, కామెంట్స్ కూడా రాసేసుకున్నారు. నేను ఈరోజు ఏం చెప్పినా వాళ్లకు అవసరం లేదు. నేను నిజంగా పెళ్లికి రెడీ అయి, ఎవరైనా వ్యక్తి పేరు చెబితే ప్రేక్షకులు తట్టుకోలేరు. కాబట్టి నేను వాళ్లను డిసప్పాయింట్ చేయను. నిజంగా పెళ్లి చేసుకుంటే మాత్రం చెప్పి చేసుకుంటాను.”
ఇలా తన పెళ్లిపై స్పందించింది ఝాన్సీ. వివాహ వ్యవస్థకు దూరంగా జరగాలని ప్రయత్నించే ప్రతి మహిళపై రకరకాల వ్యాఖ్యలు, వేధింపులు ఉంటాయని.. అవన్నీ తట్టుకొని నిలబడినట్టు తెలిపింది ఝాన్సీ. తన కుటుంబం నుంచి తనకు పూర్తి భరోసా ఉందని, బయట ఎంతమంది ఎన్ని అనుకున్నప్పటికీ తనకు ఎలాంటి భయం-నష్టం ఉండదంటోంది.