అనుకున్నట్టే జరిగింది. 48 గంటల డెడ్ లైన్ తర్వాత బాబు పరువుపోవడం మినహా ఇంకేమీ కాదని అంతా అనుకున్నారు. అలానే జరిగింది. డెడ్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత మాట నిలబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు. ఆ జూమ్ మీట్ లోనే అంతా చెప్పేశారు. ఉద్యమం ఇక ప్రజల ఆందోళనలతోనే ముడిపడి ఉందని తప్పించుకోజూశారు. అవసరమైతే కేంద్రం జోక్యం చేసుకోవాలని బాల్ ని బీజేపీ కోర్టులోకి నెట్టే ప్రయత్నమూ చేశారు.
మొత్తానికి తనపై భారం పెట్టుకోకుండా ఇక పోరాటం మీదేనన్నారు బాబు. వైసీపీ నేతలకు దమ్ము ధైర్యం లేదని, ఉంటే తమ సవాల్ కి స్పందించేవారని, రాజీనామాలు చేసి ఎన్నికల బరిలో దిగేవారని, పిరికిపందల్లా పారిపోయారని.. అంటూ తన ఉపన్యాసం మొదలుపెట్టిన చంద్రబాబు.. అమరావతిపై తాను ఏమేం చేశానో త్వరలో అందరికీ తెలియజేస్తానని చెప్పారు.
అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా జగన్ అమరావతికి అనుకూలంగా మాట్లాడారని, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మూడు రాజధానులు అనే అంశాన్ని వైసీపీ పెట్టలేదని.. ఇప్పుడు రాజధానిని విభజిస్తున్నారంటే జగన్ ఆడిన మాట తప్పినట్టేనంటూ చెత్త లాజిక్ తీశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనే పదాన్ని కూడా పలకడం చంద్రబాబుకి ఇష్టం లేనట్టుంది. అందుకే రాజధాని తరలింపు అంటూ దుష్ప్రచారం చేస్తూ తన అక్కసు వెళ్లగక్కారు.
జగన్ అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు తమకున్న 23 ఎమ్మెల్యే సీట్లు కూడా త్యాగం చేస్తానని చెప్పడం చంద్రబాబు అవివేకానికి మరో నిదర్శనం. అంత త్యాగశీలే అయిఉంటే.. ఇప్పుడే రాజీనామా చేసి అమరావతికి అనుకూలంగా పోరాటాలు చేయొచ్చు కదా. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్రం పదే పదే చెబుతున్నా కూడా తన రాజకీయ లాభం కోసం బీజేపీని ఇందులో ఇరికించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. రామమందిర నిర్మాణానికి పవిత్ర జలాలతో శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, అదే హోదాలో అమరావతికి కూడా పవిత్ర జలాలతో శంకుస్థాపన చేశారని, మరి దీని సంగతి పట్టించుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా అని ప్రశ్నించారు.
మొత్తమ్మీద చంద్రబాబు తన చేతిలో ఏమీ లేదని తేల్చి చెప్పారు. 23మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయబోరని తెగేసి చెప్పారు. విచిత్రంగా ఇంకో డెడ్ లైన్ కూడా పెట్టలేదు బాబు, అంటే భవిష్యత్ కార్యాచరణ ప్రారంభించకుండానే పోరాటం ముగించారన్నమాట.