‘లేస్తే మనిషిని కాదు’.. అయితే ఓసారి లే బాలయ్యా!

లేస్తే మనిషిని కాను అనే వాళ్లల్లో బాలకృష్ణ ముందుంటారు. చావు తప్పి కన్ను లొట్టబోయిన రీతిలో హిందూపురంలో గెలిచిన బాలయ్య.. ఆ తర్వాత పూర్తిగా నియోజకవర్గాన్ని గాలికొదిలేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు,…

లేస్తే మనిషిని కాను అనే వాళ్లల్లో బాలకృష్ణ ముందుంటారు. చావు తప్పి కన్ను లొట్టబోయిన రీతిలో హిందూపురంలో గెలిచిన బాలయ్య.. ఆ తర్వాత పూర్తిగా నియోజకవర్గాన్ని గాలికొదిలేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, ఇప్పుడు కనీసం ఆ ఛాయలకు కూడా వెళ్లడం లేదు. 

ఎప్పుడో ఓసారి వెళ్లి, అభిమానులపై చేయి చేసుకుని వచ్చేస్తాడంతే. అలాంటి బాలయ్య.. త్వరలో తాను రోడ్ షో చేస్తానని ఆమధ్య పంచ్ డైలాగులు కొట్టారు. తాను రోడ్లపైకి వస్తానని, తన సంగతేంటో చూపిస్తానని చెప్పారు. బోయపాటి అఖండ పూర్తవగానే కార్యాచరణ మొదలు పెడతానన్నారు బాలయ్య.

అఖండ సినిమా షూటింగ్ పూర్తయింది, బాలకృష్ణ పూర్తిగా రాజకీయాల్లో బిజీ అవుతారేమో అనుకున్నవాళ్లకి అప్పుడే క్లారిటీ ఇచ్చేశారాయన. వరుసగా రెండు సినిమాలు ఒప్పుకుని, తన ఫస్ట్ ప్రయారిటీ సినీ ఇండస్ట్రీకేనని చెప్పేశారు. 

ఓవైపు చంద్రబాబు, లోకేష్ పార్టీ పరువు ఎలా కాపాడాలా అంటూ తెగ ఇబ్బంది పడుతున్నారు. పాదయాత్ర చేయాలా, సైకిల్ యాత్ర చేయాలా, వచ్చే ఎన్నికలనాటికి కారులో రాష్ట్రం మొత్తం తిరిగి రావాలా అని అనుకుంటున్నారు. అదే సమయంలో బాలకృష్ణ మాత్రం అసలు తనకేం పట్టనట్టే వ్యవహరిస్తున్నారు.

ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉంది. 2024లో కోలుకోకపోతే కాంగ్రెస్ కి ఏపీలో పట్టిన గతే టీడీపీకి కూడా పడుతుంది. ఈ దశలో ఎన్టీఆర్ ని అభిమానించేవారు, పార్టీని కాపాడుకోవాలనుకునేవారు తెగ ఇదైపోతున్నారు. కానీ బాలయ్య మాత్రం అస్సలు పార్టీ వ్యవహారాలను పట్టించుకోలేదు. 

గతంలో మాత్రం లెక్కలేనన్ని కోతలు కోశారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని, త్యాగాలకు సిద్ధంగా ఉండాలని, అయ్యేదేదో అవుతుంది, నేరుగా తాడోపేడో తేల్చుకోడానికి తానే రెడీ అని స్టేట్ మెంట్లిచ్చారు. కానీ అవన్నీ వట్టి మాటలేనని నెలలు తిరక్కముందే అర్థమవుతోంది.

కనీసం బాలయ్య లాంటి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్నవారు కూడా జనాల్లోకి రాకపోతే ఇక టీడీపీ పరిస్థితి ఏంటి..? లోకేష్ తోపాటు బాలకృష్ణ కూడా ఉన్నాడంటే జనాలు కనీసం రోడ్డుపైకయినా వచ్చి చూసి వెళ్తారు. ఆమాత్రం ఆకర్షణ లోకేష్ కి లేకనే ఇప్పుడు చంద్రబాబు తెగ ఇదైపోతున్నారు. 

తండ్రి పెట్టిన పార్టీపై ఆసక్తి లేకపోయినా, కనీసం అల్లుడి భవిష్యత్తు కోసమైనా బాలకృష్ణ డేరింగ్ డెసిషన్ తీసుకుంటారా లేక డైలాగులతోనే కాలక్షేపం చేస్తారా చూడాలి.