ఏపీలో రాజకీయ పార్టీలన్నీ చేయాల్సిన పనులు చేయడం లేదు. అసలు మేటర్ పక్కనపెట్టి కొసరు రాజకీయాలు పట్టుకుని వేలాడుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోడానికి వైసీపీ చేయాల్సిందేంటి..? చేస్తున్నదేంటి..? అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాలు చేయాల్సిందేంటి..? చేస్తున్నదేంటి..? వీటిపై ఓ లుక్కేస్తే.. అసలు పార్టీలన్నీ కొసరు రాజకీయాలతోనే బిజీగా ఉన్నాయని అర్థమవుతుంది.
వైసీపీ ఏం చేస్తుంది..? ఏంచేయాలి..?
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలొస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈపాటికే జగన్ పాదయాత్రపై నిర్ణయం తీసుకున్నారు. పార్టీ శ్రేణులన్నీ ముందుగానే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చి సమర శంకం పూరించారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.
అధికారంలోకి వచ్చాక దాదాపుగా అందరూ రిలాక్స్ అయ్యారు. జగన్ నవరత్నాల అమలులో తలమునకలై ఉన్నారు. అధినేత బిజీగా ఉండటంతో.. మిగతా వారిలో చురుకు లేదు. మంత్రి వర్గ విస్తరణ అని చెప్పారే కానీ దానికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడినట్టు లేదు. మరోవైపు అంతా కొత్తవారే వస్తారనే లీకులతో పాతవారి పనితీరు తీవ్రంగా ప్రభావితం అవుతోంది. అమాత్యులంతా ఆందోళనకు గురై స్తబ్దుగా మారిపోయారు.
ఇప్పటికైనా జగన్ నవరత్నాల అమలుతో పాటు, పాలనా వ్యవహారాలపై కూడా పూర్తి స్థాయి దృష్టిపెట్టాలని కోరుతున్నారు నాయకులు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనాల్లోకి రావాలని, పథకాల అమలుని మదింపు చేయాలని ఆశిస్తున్నారు.
టీడీపీ సంగతేంటి..?
23 సీట్ల టీడీపీ రెండేళ్లలో ఉన్న ఎమ్మెల్యేలను కోల్పోయింది కానీ, పార్టీ పరిస్థితి ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా మెరుగుపడలేదు. మరోవైపు భావి నాయకుడ్ని కూడా ఇప్పటికే డిసైడ్ చేసి ఉండాల్సింది. వారసుడు లోకేష్ అనే విషయం తెలిసినా అధికారికంగా దాన్ని బయటకు చెప్పుకోలేని పరిస్థితి. కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయినా లోకేష్ ని నిలబెడతారా లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలి.
లోకేష్ పై క్లారిటీ ఇవ్వకుండా ఎన్ని రాజకీయాలు చేసినా టీడీపీకి ఉపయోగం లేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు అని చెప్పినప్పుడే టీడీపీకి రాజకీయ భవిష్యత్తు. ఆ విషయం పక్కనపెట్టి, మిగతా రాజకీయమంతా చేస్తోంది పసుపు పార్టీ.
బీజేపీ కి స్టార్టింగ్ ట్రబుల్..
ప్రస్తుతానికి జనసేనతో దోస్తీతో బీజేపీ బండి లాగించేస్తుంది కానీ.. ఆ పార్టీ సొంతంగా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. అసలు బీజేపీ ఏపీలో బలపడాలంటే కచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. అది మినహా ఎన్ని మాటలు చెప్పినా, హామీలిచ్చినా ఏపీ ప్రజలు బీజేపీ వైపు కన్నెత్తి కూడా చూడరు.
కానీ బీజేపీ ప్రత్యేక హోదా తప్ప అన్ని కబుర్లూ చెబుతుంటుంది. వాపు-బలుపు తేడా లేకుండా మాట్లాడుతోంది. అసలు మేటర్ ప్రత్యేక హోదాపై మాట్లాడిన తర్వాతే బీజేపీ మిగతా రాజకీయాలు చేస్తే బాగుంటుంది.
జనసేనకి ఇరకాటం..
జనసేన ఇప్పుడు క్రాస్ రోడ్స్ లోకి వచ్చేసింది. పవన్ కల్యాణ్ తెగించేశాడు, జనాల్లోకి రావాలనుకుంటున్నాడు. కానీ తాను బీజేపీ నీడలో ఉండాలా, టీడీపీతో కలసి వెళ్లాలా అని నిర్ణయించుకోలేకపోతున్నారు. పొత్తుల గురించి చెప్పకుండా జనసేనాని ఎన్ని కబుర్లు చెప్పినా ఎవరూ నమ్మరు.
తెరవెనక ఉండి జనసేనను టీడీపీ నడిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం జనసైనికుల్ని అయోమయంలోకి నెట్టేస్తోంది. ఇకనైనా పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చి, ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటున్నారో అక్కడ ఫోకస్ పెట్టి, గ్రౌండ్ లెవల్ లో కృషి చేస్తే మంచిది. లేకపోతే తీరా ఎన్నికలు దగ్గరపడ్డాక మీరంతా త్యాగమూర్తులు కావాలని జనసైనికుల్ని ఆదేశిస్తే వ్యవహారం చెడుతుంది.
కాంగ్రెస్ ఆల్రెడీ కాలగర్భంలో కలిసిపోయింది, వామపక్షాలు కూడా స్థిరమైన అజెండా లేకుండా అవస్థలు పడుతున్నాయి. ఈ దశలో అధికార పక్షం, ప్రతిపక్షాలు కూడా అసలు మేటర్ వదిలేసి కొసరు వ్యవహారాలతో బండి నడిపిస్తున్నాయి.