విమ‌ర్శ‌లేనా…నిరూపిస్తారా?

ఇళ్ల ప‌థ‌కంపై హైకోర్టును ఆశ్ర‌యించి నిలుపుద‌ల చేయించ‌డంపై తీవ్ర దుమారం రేగుతోంది. చేతికొచ్చిన ఇళ్లు చేజారుతున్నాయన్న భ‌యాందోళ‌న ల‌బ్ధిదారుల్లో నెలకుంది. ఈ నేప‌థ్యంలో నవరత్నాలు – పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కంపై హైకోర్టులో త‌మ పేరుతో త‌ప్పుడు…

ఇళ్ల ప‌థ‌కంపై హైకోర్టును ఆశ్ర‌యించి నిలుపుద‌ల చేయించ‌డంపై తీవ్ర దుమారం రేగుతోంది. చేతికొచ్చిన ఇళ్లు చేజారుతున్నాయన్న భ‌యాందోళ‌న ల‌బ్ధిదారుల్లో నెలకుంది. ఈ నేప‌థ్యంలో నవరత్నాలు – పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కంపై హైకోర్టులో త‌మ పేరుతో త‌ప్పుడు పిటిష‌న్లు వేశారంటూ కొంద‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం రాజ‌కీయ రచ్చ‌కు ఆజ్యం పోసిన‌ట్టైంది.

త‌మ‌కు తెలియకుండా త‌మ‌ వివరాలతో కేసు వేసిన కుట్రదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తుమ్మపూడి అశోక్‌కుమార్, పరుచూరు బేబీ సరోజిని, కొండా నాగమంజుల, కనికరం రాంబాబు, శేని సత్యవతి, ఎస్‌ లీలాప్రసాద్, చనగవరపు శివకుమారి, షేక్‌ జిలాని, భీమిశెట్టి రామ్మోహన్‌రావు తదితరులు తెనాలి త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు.

తాము ఇళ్ల స్థలాల కోసం ఏ కోర్టులోనూ కేసులు వేయలేదని, ఏ ప్లీడర్‌ను కలవలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వద్ద నుంచి ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు తీసుకున్న గుండెమెడ అమ్మేశ్వరరావు, ఎం. మల్లేశ్వరరావు త‌మ స్వార్థం కోసం సంత కాలు ఫోర్జరీ చేసి హైకోర్టులో వేసిన పిటిష‌న్ల‌తో త‌మ‌కు ఎటువంటి సంబంధం లేదని బాధితులు పేర్కొన్నారు. కుట్రదారులెవ‌రో తేల్చాల‌ని ఫిర్యాదులో కోరారు.

ఇదిలా వుండ‌గా పిటిషన్ల తంతు నెరిపిన తెనాలిలోని కొత్త‌పేట‌కు చెందిన జి.అమ్మేశ్వ‌ర‌రావు, మ‌ల్లేశ్వ‌ర‌రావుల‌కు టీడీపీ ముఖ్య నేత‌ల మ‌ద్ద‌తు ఉంద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. వీరు కేవ‌లం పాత్ర‌ధారులే అని, అస‌లు సూత్ర‌ధారులు టీడీపీ నాయ‌కులే అని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.  

ఇదిలా వుండ‌గా టీడీపీ నేత‌ల‌పై కేవ‌లం ఆరోప‌ణ‌లు చేయ‌డం, కేసులు పెట్ట‌డం వ‌ర‌కే ప‌రిమితం కాకుండా నిజానిజాలు నిగ్గు తేల్చాల‌నే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. క‌నీసం ఒక‌ట్రెండు కేసుల్లో ఇలాంటి కుట్ర‌దారుల‌కు శిక్ష ప‌డేలా చేస్తే, మ‌రొక‌రు భ‌యంతోనైనా ముందుకు రార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఎంతో కీల‌క‌మైన ఇళ్ల కేసులోనైనా కుట్ర‌పూరిత పిటిష‌న్లు వేసిన వాళ్ల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌ట్టుకుని త‌గిన శిక్ష విధిస్తుందా? అనేది కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.