గత 24 గంటలకు సంబంధించి, ఇండియాలో కరోనా కేసుల నంబర్లలో కొత్త మార్పు చోటు చేసుకుంది. గత కొన్నాళ్లుగా ఇండియాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. రోజు వారీగా 50 వేలకు మించి ఇన్ఫెక్షన్లు నమోదవుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో రికవరీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. గత 24 గంటలకు సంబంధించి చూస్తే.. కొత్తగా నమోదైన యాక్టివ్ కేసుల సంఖ్య కన్నా రికవరీల సంఖ్య పెరగడం ఊరటను ఇచ్చే అంశంగా మారింది.
నంబర్ల వారీగా చూస్తే.. గత 24 గంటల్లో 51,051 కొత్త కేసులు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో 51,083 మంది కరోనా నుంచి రికవర్ అయినట్టుగా సమాచారం. కొత్త యాక్టివ్ కేసలు సంఖ్య కన్నా రికవర్ అయ్యి డిశ్చార్జి అయిన వారి సంఖ్య స్వల్పంగా ఎక్కువగా ఉంది. తేడా స్వల్పమే అయినా ఇది ఊరటను కలిగించే అంశం. దేశంలో కరోనా తీవ్రత పెరిగాకా.. ఏ రోజూ ఇలా యాక్టివ్ కేసుల సంఖ్య కన్నా రికవరీల సంఖ్య పెరగలేదు. అయితే ఇప్పటి వరకూ ఇది ఒక్క రోజు ట్రెండే.
ఇన్ఫెక్షన్ల సంఖ్య కన్నా రికవరీల సంఖ్య మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. అలా కొన్ని రోజుల పాటు కొనసాగితే తప్ప కరోనా నియంత్రణలోకి వచ్చే అవకాశాలు లేనట్టే. ఏదేమైనా ప్రస్తుతానికి కొంత వరకూ సానుకూల పరిస్థితి కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. కానీ, ఇండియాలో కరోనా మరణాల సంఖ్య కూడా పెరగడం గమనార్హం. గత ఇరవై నాలుగు గంటల్లో 800 మందికి పైగా కరోనాతో మరణించినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.