టీవీ9లో ప్రతిరోజూ సాయంత్రం నిర్వహించే బిగ్ డిబేట్‌కు ప్రాధాన్యం ఉంది. ఈ డిబేట్ సమన్వయకర్త రజినీకాంత్ సమయం, సందర్భం చూసుకుని ప్రశ్నలు సంధిస్తూ చర్చను రక్తి కట్టిస్తుంటారు. అందులోనూ మిగిలిన చానళ్లలో మరీ ఏకపక్షంగా డిబేట్లు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీవీ9 డిబేట్‌కు కొంత ప్రాధాన్యం ఉంది. తెలుగునాట కొన్ని చానళ్ల చర్చలకు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న బీజేపీ, వైసీపీ అసలు వెళ్లనే వెళ్లని పరిస్థితి.
ఈ నేపథ్యంలో టీవీ9 లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన బిగ్ డిబేట్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఏపీ రాజకీయాలను మూడు రాజధానుల అంశం వేడెక్కిస్తున్న నేపథ్యంలో “ఏపీ పొలికల్ జంక్షన్‌లో వీర్రాజు ఫార్ములా ఏంటి?” అనే ప్రశ్నతో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజుతో రజినీకాంత్ చేసిన చర్చ ఆద్యంతం ఆసక్తి కలిగించింది. అయితే యాంకర్‌గా రాజకీయ నేతలను ఉక్కిరిబిక్కిరి చేసే రజినీకాంత్…ఈ డిబేట్‌లో తానే ప్రశ్నలకు గురి కావడం అసలు ట్విస్ట్. ఇంకా చెప్పాలంటే టీవీ9ని మాటల మాంత్రికుడు చెడుగుడు ఆడుకున్నారంటే అతిశయోక్తి కాదు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై క్లారిటీ కావాలని, అధ్యక్షునిగా నియమితులైన తర్వాత ఢిల్లీ వెళ్లి వచ్చారని, వైఖరిలో ఏదైనా మార్పు వచ్చిందా? అని సోము వీర్రాజును రజినీకాంత్ తనదైన స్టైల్‌లో ప్రశ్నించారు. ఆ ప్రశ్నపై సోము వీర్రాజు స్పందిస్తూ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అసలు రెండో ఆలోచనకు తావే లేదని స్పష్టం చేశారు. కానీ తనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది టీడీపీ, వైసీపీ అనే రెండు పార్టీల మధ్య సమస్య అన్నారు.
అలాంటప్పుడు ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్‌రెడ్డిలను కూర్చో పెట్టి చర్చించాలని రజినీకాంత్‌కు సోము వీర్రాజు సూచించారు. అంతే తప్ప, దీన్ని మరెవరి మీదో నెట్టేస్తాం అంటే మాత్రం అది రాజకీయం అవుతుందని స్పష్టం చేశారు. రాజకీయం కావాలా? పరిష్కారం కావాలా? అని సోము వీర్రాజు టీవీ9 రజినీకాంత్‌ను సూటిగా ప్రశ్నించారు.
సోము వీర్రాజుపై రజినీకాంత్ కూడా అంతే సమయ స్ఫూర్తితో ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయం కాదు…ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టత కావాలని, అది మీరు ఇవ్వాలంటూ రెట్టిస్తూ ప్రశ్నించారు. ఇలా ప్రశ్నలు, జవాబులు, ప్రశ్నలతో డిబేట్ క్షణక్షణానికి 20-20 క్రికెట్‌లా కిక్ ఇచ్చింది..
ఈ డిబేట్‌కు సోము వీర్రాజు ఎంత సమాయత్తమై వచ్చారో…ఆయన ఇచ్చే సమాధానాలు, వేసే ప్రశ్నలే తెలియజేశాయి. స్పష్టత కావాలనే ప్రశ్నపై సోము దీటైన సమాధానం ఇచ్చారు. వైసీపీకి 151 సీట్లు, టీడీపీకి 23 సీట్లు ఇచ్చారన్నారు. అదే తమకు అధికారం ఇస్తే ఆరు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. కేంద్రంలో తమ పార్టీకి అధికారం ఇవ్వడం వల్లే చైనా సమస్య, ఆర్టికల్ 370 సమస్య (జమ్మూలో), అలాగే అయోధ్య సమస్యను పరిష్కరించి రాముడి గుడి కడుతున్నామని చెప్పుకొచ్చారు. దీంతో రజినీకాంత్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిని కల్పించారంటే సోము వీర్రాజు ఎంత తెలివిగా, లాజిక్‌గా మాట్లాడారో అర్థం చేసుకోవచ్చు.
ఈ చర్చలో ఓ ప్రశ్నకు సోము వీర్రాజు ఇచ్చిన సమాధానం లేదా కౌంటర్ అద్భుతహః అనే రీతిలో ఉంది. అందుకే సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. అదేంటో తప్పక తెలుసుకోవాల్సిందే.
“మీరు ఎదగాలంటే అధికార పార్టీ మీద పోరాటం చేయాలి. కానీ ప్రతిపక్ష పార్టీ మీద పోరాటం చేస్తున్నారట కదా ?” అని రజనీకాంత్ సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సోము వీర్రాజు సమాధానం ఎలా ఉందంటే…ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొడితే స్టేడియం అంతా ఎలా హోరెత్తుతుందో…డిబేట్‌ను చూస్తున్న ప్రేక్షకులు అలా ఆనందానికి లోనయ్యేలా ఉంది. ఆ సమాధానం ఏంటో సోము మాటల్లోనే…
“అది మీకెందుకు ఇబ్బంది? ఎవరి మీద పోరాటం చేస్తే ఏం జరుగుతుందో మాకంటూ ఓ అంచనా ఉంటుంది కదా. అది కూడా మీరు డిసైడ్ చేస్తే ఎలాగండి రజినీకాంత్ గారు. వాళ్ల మీద మాట్లాడొద్దు…వీళ్ల మీదే మాట్లాడాలి… అంటే మీ డైరెక్షన్‌లో వెళ్లాలా మేము. మాకంటూ డైరెక్షన్ ఉండకూడదా? ఇదేంటండి రజినీకాంత్ గారు. మీరు ధర్మప్రభువులు. అలా చేస్తే(అడిగితే) ఎలా సార్? మీరు తెలుగుదేశాన్ని అనొద్దు…వైసీపీని అనండి …మేము ఎవర్ని అనాలి? ఏం చేయాలి? అనే లక్ష్యం, ఆలోచన మాకు ఉండకూడదా? దయచేసి చెప్పండి. వాళ్లనే(వైసీపీని) అనండి? వాళ్లను(టీడీపీని) ఎందుకంటారని ప్రశ్నిస్తున్నారేంటి? నాకు అర్థం కాదు. మీకు ఇబ్బంది ఏంటి? తెలుగుదేశాన్ని అంటే మీకు ఇబ్బంది ఏంటి? వైసీపీని అంటే మీకు ఇబ్బంది ఏంటి? మీకెందుకండి ఆ బాధ?” ….ఇలా సాగింది సోము వీర్రాజు మాటల దాడి. ఈ డిబేట్‌లా చాలా ప్రశ్నలకు, అనుమానాలకు సోము వీర్రాజు ఎంతో స్పష్టత ఇచ్చారు.