ముడ్డి మీద తంతే మూతి పళ్లు రాలినట్టుగా మారింది చైనీ కంపెనీల పరిస్థితి. ఇండియా-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు వాటి పాలిట విచిత్రంగా మారాయి. అంత వరకూ వీలైనంతగా ఇండియాలో క్యాష్ చేసుకుంటూ వచ్చిన వివిధ చైనా కంపెనీలు నిషేధం బారిన పడ్డాయి. ప్రత్యేకించి టిక్ టాక్, యూసీ వంటి వాటికి శరాఘాతమే తగిలింది. వీటిల్లో టిక్ టాక్ బైట్ డ్యాన్స్ కంపెనీ కాగా, యూసీ అలీబాబాలో భాగం. ఇప్పటికే యూసీ ఇండియాలో చాప చుట్టేసింది. టిక్ టాక్ ది కూడా అదే పరిస్థితి.
అయితే.. భారత ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటికే ఆ సంస్థ పలు ప్రయత్నాలు చేసింది. తమ హెడ్ ఆఫీస్ ను సింగపూర్ కు తరలిస్తామని కూడా చెప్పుకొచ్చింది. ఏం చెప్పినా ఇప్పుడు అవకాశం లేనట్టే.
ఆ సంగతలా ఉంటే.. అమెరికాలో కూడా టిక్ టాక్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. చైనీ యాజమాన్యంలో ఉంటే టిక్ టాక్ ను అమెరికాలో నిషేధించబోతున్నట్టుగా ట్రంప్ ఇది వరకే తేల్చారు. 45 రోజుల సమయం ఇచ్చి, ఆ లోపు అమ్మేస్తే సరేసరి, లేకపోతే నిషేధమే అని ట్రంప్ తేల్చి చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయని, టిక్ టాక్ ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడం ఖాయమే అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి కొన్ని అమెరికన్ భాగస్వామ్య కంపెనీలను కలుపుకుని టిక్ టాక్ ను కొనుగోలు చేయనుందట మైక్రోసాఫ్ట్.
ఈ క్రమంలో టిక్ టాక్ ను అమ్ముకోవడం తప్ప బైట్ డ్యాన్స్ కు మరో మార్గం కనిపిస్తున్నట్టుగా లేదు. కేవలం అమెరికా వరకే కాకుండా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల యాజమాన్య హక్కులను కూడా కొనుక్కొనే ఆలోచనలో ఉందట మైక్రోసాఫ్ట్. ఇలాంటి నేపథ్యంలో.. ఇండియా హక్కులను కూడా టిక్ టాక్ కు అమ్ముకునే అవకాశాలు లేకపోలేదు. ఏ ఇండియన్ మోతుబరో, లేక మైక్రోసాఫ్టే ఇండియా పరిధిలో కూడా టిక్ టాక్ ను కొనుగోలు చేసుకునే అవకాశాలున్నట్టేనేమో!
అయితే ట్రంప్ తరహాలో దేశీయ యాజమాన్యం వస్తే టిక్ టాక్ పై నిషేధం ఎత్తేయడం మీద భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఒకవేళ మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసినా, లేక ఏ అంబానీయో కొనుగోలు చేసినా.. టిక్ టాక్ నిషేధం ఎత్తేయడానికి భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. మళ్లీ టిక్ టాక్ యాప్ యాక్టివేట్ అయ్యే అవకాశాలున్నట్టే! ఇండియాలో మైక్రోసాఫ్ట్ కు ఉన్న పట్టును బట్టి చూసినా, ముకేష్ అంబానీ ఆ యాప్ ను కొన్నా.. అది బంపర్ వెంచరే అవుతుంది! ఈ దిశగా పావులు కదిపే అవకాశాలు పెరుగుతున్నట్టే. టిక్ టాక్ యూజర్లు కూడా ఇదే కోరుకుంటూ ఉండవచ్చు!