బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు కోపం వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆయనలో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా ఓ వ్యక్తి ప్రవర్తించాడు. ఇటీవల బిగ్‌బీపై నెటిజన్స్ తరచూ ట్రోల్ చేస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని బూతద్దంలో చూడడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. చివరికి తాను కరోనాపై విజయం సాధించడానికి కారణమైన నానావతి ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని అభినందించడాన్ని కూడా ఓ మహిళ తప్పు పట్టారు.
ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. కరోనా నుంచి విముక్తుడైన సందర్భంగా నానావతి ఆస్పత్రిని, తనకు వైద్యం అందించిన వైద్యులు, నర్సుల సేవలను కొనియాడుతూ సోషల్ మీడియాలో అమితాబ్ ఓ పోస్టు పెట్టారు.
అమితాబ్ ఆ విధంగా పోస్ట్ పెట్టడాన్ని ఓ బాధిత మహిళ తప్పు పట్టారు. తన తండ్రికి కరోనా లేకపోయినా తప్పుడు రిపోర్టులతో ఆ ఆస్పత్రిలో చేర్పించుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఆస్పత్రిలో చేర్పిస్తే అసలు కరోనా లేదన్న వాస్తవం బయట పడిందన్నారు. అలాంటి ఆస్పత్రి గురించి ప్రచారం చేస్తున్న అమితాబ్‌పై ఇంత కాలం తనలో ఉన్న గౌరవం పోయిందంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
అయితే సదరు మహిళ పోస్ట్‌పై అమితాబ్ ఎంతో గౌరవంగా స్పందించారు. నానావతి ఆస్పత్రికి ప్రచారం చేయడం లేదని, తనను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. తనపై గౌరవం కోల్పోయినా తాను మాత్రం వైద్యులను గౌరవిస్తూనే ఉంటానని సదరు మహిళకు అమితాబ్ సమాధానం ఇచ్చారు.
ఇదిలా ఉంటే అమితాబ్ కరోనా నుంచి బయటపడిన సంతోషాన్ని పంచుకునేందుకు అమూల్ సంస్థ ప్రత్యేక డూడుల్ తీర్చిదిద్దింది. అమితాబ్ ఫోన్ పట్టుకుని కూర్చుంటే పక్కన అమూల్ బేబీ నిలబడి ఉండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి “ఏబీ బీట్స్ సీ” అనే ట్యాగ్‌లైన్‌ను అమూల్ జోడించింది.
ఏబీ అంటే అమితాబ్ బచ్చన్ సీ అంటే కరోనా వైరస్‌ను జయించారని అర్థం వచ్చేలా అమూల్ తన సృజనాత్మకతను ప్రదర్శించింది. దీన్ని కూడా ఓ నెటిజన్ తప్పు పట్టాడు. ఇది కూడా పబ్లిసిటీ స్టంట్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అసలే కాక మీద ఉన్న అమితాబ్…సదరు నెటిజన్ కామెంట్‌పై ఫైర్ అయ్యాడు. అమితాబ్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకొంది. దీంతో బిగ్‌బీ సీరియస్‌గా స్పందిస్తూ.. 'నీకు నిజం తెలీకపోతే నోరు మూస్కొని ఉండు' అంటూ ఘాటుగా కౌంటరిచ్చారు. అమితాబ్‌లో తీవ్ర ఆగ్రహాన్ని చూసిన నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.