కొంపదీసి మళ్లీ పోటీ చేస్తావా ఏంటి పవన్?

మూడు రాజధానుల అంశానికి, ఎమ్మెల్యేల రాజీనామాలకు ఏ సంబంధం లేకపోయినా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం తెగ గింజుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఆ రెండు జిల్లాలపైనే ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో జనసేనానికి ఆ…

మూడు రాజధానుల అంశానికి, ఎమ్మెల్యేల రాజీనామాలకు ఏ సంబంధం లేకపోయినా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం తెగ గింజుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఆ రెండు జిల్లాలపైనే ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో జనసేనానికి ఆ రెండు జిల్లాలే కనిపించాయా? మిగతా జిల్లాలతో రాజధానికి సంబంధం లేదా, వారికి అవసరం లేదా? ఏ అవసరం ఉన్నా లేకపోయినా పవన్  కు మాత్రం ఓ అవసరం ఉన్నట్టుంది.

ఉప ఎన్నికలు వస్తే కచ్చితంగా పోటీచేయాలనే ఆలోచన మాత్రం జనసేనానిలో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే రాజధాని చుట్టూ రాజకీయం అల్లుతున్నారు పవన్. కాసేపు కరోనా కష్టకాలంలో మూడు రాజధానుల ఏర్పాటు ఎందుకు అంటారు? ఇంకొంతసేపు అమరావతి రైతుల్ని ఏం చేస్తారని ప్రశ్నిస్తారు? అదీ అయిపోయాక అమరావతిలో పెట్టిన పెట్టుబడులన్నీ బూడిదలో పోసిన పన్నీరేనా అని అంటారు.

ఇలా టీడీపీ, వైసీపీ రెండింటినీ ఒకే గాటన కట్టే ప్రయత్నం చేస్తూ.. బీజేపీ, జనసేన మాత్రమే నిఖార్సయిన పార్టీలని చెప్పుకుంటుంటారు. పోనీ పవన్ మాటే నిజమై ఎమ్మెల్యేల రాజీనామాతో ఉప ఎన్నికలే వస్తాయనుకుందాం. దానివల్ల అమరావతి రైతులకి జరిగే మేలేంటి? రైతులకు మేలు జరగకపోయినా పర్లేదు ఉప ఎన్నికలు వస్తే తాను పోటీ చేయొచ్చని పవన్ అనుకుంటున్నారా?

పోనీ ఎన్నికలొచ్చి పవన్ కల్యాణ్ నిజంగానే పోటీ చేసి గెలిచే సత్తా ఆయనకు ఉందా?  ఈ ఏడాదిన్నరలో జనసేనకు బలం పెరిగిందని ఆయన అనుకుంటున్నారేమే. బీజేపీ జనసేనతో కలిసిందే అనుకుందాం. గత ఎన్నికల్లో నోటాతో పోటీపడ్డ బీజేపీ, నోటాని ఓడించిన జనసేన.. దొందూ దొందే అనిపించుకున్నాయి. అంతమాత్రానికే పవన్ కల్యాణ్ గెలుస్తారనే నమ్మకం కనీసం జనసైనికుల్లో కూడా లేదు.

పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం అని చెప్పుకునే పవన్, డబ్బులు అవసరం ఉందంటూ జనసేవ, జనసేనను పక్కనపెట్టి మళ్లీ మొహానికి మేకప్ వేసుకున్నారు. అలా తాను సీరియస్ పొలిటీషియన్ కాదని, సీజనల్ పొలిటీషియనేనని చెప్పకనే చెప్పారు. అలాంటి పవన్ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ అమరావతి పాట పాడుతున్నారు. ఇలాంటి పవన్ ని జనం ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి. ఎమ్మెల్యేల రాజీనామాతో ఉప ఎన్నికలు వస్తే ఆయన్ని ఎందుకు గెలిపించాలి.

హాస్పిటల్ లో చేరిన నటుడు పృధ్వీరాజ్

టైమ్ బాలేకపోతే ఒక్కోసారి అంతే