కేరళలో సంచలనం సృష్టించిన ఓ కేసు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. భార్యను విషపాముతో పొడిపించి హత్య చేసిన వ్యక్తికి సెషన్స్ కోర్టు ఏకంగా 2 జీవిత ఖైదు శిక్షలు విధించింది. పాము కరిచిన కేసును హత్య కేసుగా నిరూపించేందుకు కేరళ పోలీసులు చాలా కష్టపడ్డారు. పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడి, 17 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత దీన్ని హత్యగా రుజువుచేశారు. ఈ కేసులో పోలీసుల చొరవను న్యాయస్థానం ప్రత్యేకంగా మెచ్చుకుంది.
ఇంతకీ ఏం జరిగింది..?
కొల్లం ప్రాంతానికి చెందిన సూరజ్, ఉత్ర పెళ్లి చేసుకున్నారు. పెళ్లి టైమ్ లో ఉత్ర తల్లిదండ్రులు స్థాయికి మించి కట్నకానుకలు ఇచ్చారు. దీనికి కారణం ఉత్రకు ఉన్న చిన్నపాటి అంగవైకల్యం. కట్నం కోసం ఉత్రను పెళ్లి చేసుకున్న సూరజ్, తర్వాత ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. దీని కోసం ఓ రక్తపింజరి పామును కొన్నాడు. భార్య నిద్రిస్తున్న సమయంలో ఆమెపైకి వదిలాడు. పాము కాటుతో ఆమె గట్టిగా అరిచి కేకలు వేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ ఎరగనట్టు భార్యను హాస్పిటల్ లో జాయిన్ చేశాడు సూరజ్.
అలా దాదాపు 50 రోజుల పాటు చికిత్స తీసుకొని కోలుకుంది ఉత్ర. దీన్ని అంతా యాక్సిడెంట్ గానే అనుకున్నారు. ఈసారి మరింత పక్కాగా ప్లాన్ అమలు చేశాడు సూరజ్. ఉత్ర తినే ఆహారంలో మత్తు మందు కలిపాడు. ఈసారి ఏకంగా తాచుపాము కొన్నాడు. ఆ పామును తనే చేత్తో పట్టుకొని, దగ్గరుండి భార్య శరీరంపై కాటు వేయించాడు. మత్తులో ఉన్న ఉత్ర ఈసారి ప్రాణాలు కోల్పోయింది.
అనుమానం.. పెనుభూతం..
ఒకే గదిలో, ఒకే మహిళ, రెండు సార్లు పాముకాటుకు గురికావడం ఉత్ర తండ్రికి అనుమానం రేకెత్తించింది. పైగా అది ఏసీ గది. కింద నుంచి పాము వచ్చే మార్గం కూడా లేదు. దీంతో అతడు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును కేరళ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు.
పోలీసులు కూడా వెంటనే అనుమానాలన్నింటినీ రికార్డ్ చేశారు. కానీ నిరూపించడానికి సాక్ష్యాధారాల్లేవు. సరిగ్గా ఇక్కడే టెక్నాలజీని నమ్ముకున్నారు. ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్, హెర్పటాలజీ, ఫార్మకాలజీ, వెటర్నరీ.. ఇలా అన్ని విభాగాలకు చెందిన నిపుణుల్ని అనుసంధానం చేసుకుంటూ బలంగా సాక్ష్యాలు సేకరించారు. ఆ సాక్ష్యాల ఆధారంగా సూరజ్ ను అరెస్ట్ చేసి, తమదైన శైలిలో ప్రశ్నించారు. ఊహించని విధంగా తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు వచ్చేసరికి సూరజ్ కు దిక్కుతోచలేదు. నేరాన్ని అంగీకరించక తప్పలేదు.
ఒకటి కాదు.. రెండు జీవిత ఖైదులు
భార్యను హత్య చేసేందుకు పాముల గురించి తెలుసుకోవడం, పాములు ఎక్కడ అమ్ముతారు, ఎలా కాటు వేయించాలి లాంటి అంశాలన్నీ సూరజ్ ఇంటర్నెట్ లో నేర్చుకున్నాడు. వాటన్నింటినీ పోలీసులు సాక్ష్యాలతో సహా నిరూపించారు. దీంతో కోర్టులో నేరం రుజువైంది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసుగా కేరళలోనే ఇది సంచలనం సృష్టించింది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సూరజ్ కు 2సార్లు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది న్యాయస్థానం.
17 నెలల పాటు అన్ని వ్యవస్థలు కలిసి సంయుక్తంగా, నిర్విరామంగా దర్యాప్తు చేసి నేరాన్ని నిరూపించిన కేరళ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.