ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ క్షమాఫణ చెప్పారు. దసరా నవరాత్రుల్లో భాగంగా విజయవాడ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవడంలో భక్తులకు ఏవైనా అసౌకర్యం కలిగించి ఉంటే భక్తులు పెద్ద మనసుతో తమను మన్నించాలని ఆయన కోరారు.
దసరవా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని బుధవారం డీజీపీ గౌతమ్ దర్శించుకున్నారు. డీజీపీకి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదపండితుల ఆశీర్వచనం పొందారు.
దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిన్నచిన్నపొరపాట్లు జరుగుతాయన్నారు. వాటిని భక్తులు పెద్ద మనసుతో క్షమించాలని అభ్యర్థించారు. దసరా శరన్నవరాత్రిలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందన్నారు.
దసరా నవరాత్రి ఉత్సవాలలో పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ప్రశంసించారు. ఇదిలా ఉండగా కేశినేని నాని వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంపై ఎంపీ మనస్తాపం చెందిన విషయం తెలిసిందే.
పోలీసుల వైఖరికి నిరసనగా తన కుటుంబ సభ్యులతో కలిసి నడుచుకుంటూ వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వెళ్లిన జేసీని ఓ ఎస్ఐ అడ్డుకోవడం కూడా వివాదాస్పదమైంది. దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.
ఇలా కొన్ని చోట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ క్షమాపణ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.