గన్నవరంలో వైసీపీ కూడా రాజకీయంగా వేగంగా పెంచింది. అక్కడ టీడీపీ తరపున వైసీపీ నుంచి వెళ్లిన యార్లగడ్డ వెంకట్రావ్ బరిలో నిలుస్తారని స్పష్టమైంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరడమే ఆలస్యం… ఆయన్ను వెంటనే ఇన్‌చార్జ్‌గా చంద్రబాబు ఆదేశాల మేరకు లోకేశ్ ప్రకటించారు. మరోవైపు వైసీపీ తరపున వల్లభనేని వంశీ పోటీ చేయనున్నారు. దీంతో ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులు ఖరారైనట్టే. ఇక సమరమే మిగిలి వుంది.
ఈ నేపథ్యంలో వంశీకి వ్యతిరేకంగా ఉన్న దుట్టా రామచంద్రరావుతో సయోధ్య కోసం వల్లభనేని వంశీ తన ప్రయత్నాల్ని మొదలు పెట్టారు. ఇవాళ దుట్టా రామచంద్రరావు ఇంటికి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, వంశీ అనుచరులు వెళ్లారు. దుట్టాతో వంశీకి విభేదాలు ఎక్కువగానే ఉన్నాయి. దుట్టా రామచంద్రరావు అల్లుడు, కడప నివాసి డాక్టర్ శివభరత్‌రెడ్డి గతంలో వంశీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
‘పశువైద్యుడు కాబట్టి పశువులా మాట్లాడుతున్నావ్. కానీ మాకు సంస్కారం ఉంది. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైసీపీలోనే ఉంటాం. మా సహనానికి పరీక్ష పెట్టొద్దు. సహనం కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేరు.’ అని శివభరత్‌రెడ్డి గతంలో వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. వల్లభనేని వంశీ పశువైద్య విద్యను అభ్యసించారు. డాక్టర్ శివభరత్‌రెడ్డి మనుషుల వైద్యుడు.
మొదటి నుంచి వైసీపీలో వుంటున్న తమను వల్లభనేని వంశీ వేధిస్తున్నారనేది దుట్టా వర్గం ఆరోపణ. గతంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వర్గ రాజకీయాలు కొనసాగితే రాజకీయంగా నష్టపోతామని వైసీపీ అధిష్టానం భావించింది. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగింది. మచిలీపట్నం ఎంపీతో పాటు వంశీ ముఖ్య అనుచరులు కూడా దుట్టా ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ చర్చలు ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తాయో చూడాలి.