అది త‌ప్ప మ‌రేం చేసినా, చంద్ర‌బాబు గాలి పోతుంది!

48 గంట‌ల హెచ్చ‌రిక చేసిన తెలుగుదేశం అధినేత‌, ఈ గ‌డువు పూర్తి అయిన త‌ర్వాత త‌న పార్టీ ఎమ్మెల్యేలంద‌రి చేతా రాజీనామాలు చేయించ‌డం త‌ప్ప‌, మ‌రేం చెప్పినా పోయేది ఆయ‌న ప‌రువే  అని అభిప్రాయ‌ప‌డుతున్నారు…

48 గంట‌ల హెచ్చ‌రిక చేసిన తెలుగుదేశం అధినేత‌, ఈ గ‌డువు పూర్తి అయిన త‌ర్వాత త‌న పార్టీ ఎమ్మెల్యేలంద‌రి చేతా రాజీనామాలు చేయించ‌డం త‌ప్ప‌, మ‌రేం చెప్పినా పోయేది ఆయ‌న ప‌రువే  అని అభిప్రాయ‌ప‌డుతున్నారు సామాన్య ప్ర‌జ‌లు కూడా. అమ‌రావ‌తి మాత్ర‌మే రాజ‌ధాని ఉండాలి అని చంద్ర‌బాబు నాయుడు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో బిల్లును వెన‌క్కు తీసుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వాన్ని ఆయ‌న హెచ్చ‌రించారు. అది కూడా 48 గంట‌ల్లోపు జ‌రిగిపోవాల‌ని చంద్ర‌బాబు నాయుడు హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వం ఆ ప‌ని చేయ‌క‌పోతే ఏం చేయ‌బోతున్న‌ట్టో చంద్ర‌బాబు నాయుడు చెప్ప‌లేదు.

ప్ర‌భుత్వం ఆ ప‌ని ఎలాగూ చేయ‌లేదు. 23 ఎమ్మెల్యేలున్న పార్టీ నేత మాట‌ను, అందునా చంద్ర‌బాబు మాట‌ను లెక్క‌లోకి తీసుకునేది ఉండ‌దు జ‌గ‌న్ ప్ర‌భుత్వం. మ‌రి ఎలాగూ త‌న మాట‌ను లెక్క చేయ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు నాయుడు ఎలాంటి బాణం సంధిస్తారు? అనేదే కీల‌క‌మైన ప్ర‌శ్న‌. చంద్ర‌బాబు వ‌ద్ద కోర్టు త‌ప్ప మ‌రో ఆయుధం లేద‌ని కూడా స్ప‌ష్టం అవుతోంది. ఆ మాత్రం దానికే అయితే ఇలా 48 గంట‌ల గ‌డువు అనేది పెద్ద కామెడీ అవుతుంది.

ఈ విష‌యంలో కేసీఆర్ ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని చంద్ర‌బాబుకు సూచిస్తున్నారు ఆయ‌న శ‌త్రువులు కూడా. తెలంగాణ కోసం కేసీఆర్ త‌న పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించారు త‌ప్ప‌.. ఎన్నిక‌లు పెట్టాలంటూ డిమాండ్ చేయ‌లేదు. త‌న వాళ్ల చేత రాజీనామా చేయించి , ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి సెంటిమెంట్ చాటాల‌ని కేసీఆర్ అనేక సార్లు ప్ర‌య‌త్నించారు. ఆ ప్ర‌య‌త్నంలో ఒక‌సారి విఫ‌లం అయినా, మిగ‌తా స‌మ‌యాల్లో స‌క్సెస్ అయ్యారు. ఇలాంటి నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు త‌న పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తే అది తెగువ అవుతుంది. అమ‌రావ‌తి సెంటిమెంట్ ఏపీ అంత‌టా ఉంద‌ని చంద్ర‌బాబు నాయుడు వాదిస్తున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో దాన్ని నిరూపించ‌డానికి కూడా ఉప ఎన్నిక‌లు త‌ప్ప మ‌రో అవ‌కాశం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో.. 48 గంట‌ల గ‌డువు త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ ఎమ్మెల్యేల రాజీనామా విష‌యాన్ని త‌ప్ప మ‌రేం ప్ర‌క‌టించినా.. ఆయ‌నే ప‌రువు పోగొట్టుకుంటారు.

హాస్పిటల్ లో చేరిన నటుడు పృధ్వీరాజ్

టైమ్ బాలేకపోతే ఒక్కోసారి అంతే