కరోనా బాధితులను కాపాడుకునేందుకు ఏం చేయాలనే అంశంపై ప్రతి ఒక్కరూ తమతమ స్థాయిల్లో తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అందరి ఆశయం ఒక్కటే…వ్యాక్సిన్ వచ్చే వరకు మనల్ని మనం కాపాడుకోవాలి. కరోనా వైరస్ నేర్పుతున్న పాఠాలు, గుణపాఠాలు ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నాయి. ప్రతి అనుభవం విలువైందే.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారిన పడ్డవాళ్లని కాపాడేందుకు…ఆ మహమ్మారిపై విజయం సాధించిన వారంతా ప్లాస్మా దానం చేయాలని నేచురల్ స్టార్ నాని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానంపై ప్రభుత్వాలు అవగాహన కల్పించడంతో పాటు ప్రోత్సహిస్తున్నాయి. జగన్ సర్కార్ ప్లాస్మా దానం చేసిన వారికి రూ.5 వేలు ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తోంది.
ఇదిలా ఉండగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కమిషనర్ సజ్జనార్ కోవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ రూమ్ వేదికగా ప్లాస్మా దానం స్వీకరించేందుకు ప్రముఖుల నుంచి పిలుపునిచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ ప్రముఖ హీరో నాని ఓ మంచి సందేశంతో కూడిన పిలుపునిచ్చారు.
ఇప్పటికే లక్షలాది మంది కోవిడ్ బారిన పడడంతో పాటు ఎక్కువ మంది కోలుకున్నారని నాని తెలిపారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారంతా ప్లాస్మా దానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ నుంచి కోలుకున్న ఓ వ్యక్తి ఇచ్చే 500 ఎంఎల్ ప్లాస్మా ద్వారా ఇద్దరు కోవిడ్ బాధితులు కోలుకోవడానికి అవకాశం కల్పించినవారవుతారని అన్నారు. ఇద్దరి ప్రాణాలను కాపాడడం వల్ల కలిగే సంతృప్తి, ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు. కావున ప్లాస్మా దానానికి కోవిడ్ నుంచి కోలుకున్న వారు ముందుకు రావాల్సిన ఆవశ్యకతను ఆయన తెలియజేశారు.