కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత డాక్టర్ శివరామకృష్ణారావు రెండు రోజుల క్రితం రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద సన్యాసం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇకపై ఆయన శివరామానంద సరస్వతిగా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై సమాజం విమర్శల్లో వ్యంగ్యం జోడించి సరికొత్త అంశాన్ని తెర మీదకు తెస్తోంది.
రాష్ట్రంలో శివరామకృష్ణారావు సన్యాస స్వీకరణ అంశాన్ని మరిచిపోకనే, మరో సీనియర్ నేత కూడా రాజకీయ సన్యాసం తీసుకున్నారనే సెటైర్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడాయన రాజకీయ సన్యాసం స్వీకరించారని, ఇకపై చంద్రబాబాగా ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని కొనసాగిస్తారనే వ్యంగ్యాస్త్రాలను నెటిజన్స్ సంధిస్తున్నారు.
రాజకీయాలంటేనే రచ్చలు, రాద్ధాంతాలు, అధికార దబాయింపులు, అప్రజాస్వామిక విధానాలని, అన్నీ తెలిసి కూడా… ఇప్పు డేదో జగన్ ప్రభుత్వంలో కొత్తగా జరుగుతున్నట్టు గగ్గోలు పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని గతంలో ప్రజాస్వామ్య హననానికి పాల్పడిన ఘటనల గురించి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే నేడు పరిషత్ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చే వారు కాదని హితవు చెబుతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో రాజకీయాలపై విముఖత, విరక్తి కలిగాయని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో అది కాస్త పతాక స్థాయికి చేరి …సన్యసించాలని సదరు ప్రాంతీయ పార్టీ అగ్రనేత ఓ నిర్ణయానికి వచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాజకీయాల్లో ఉంటే ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంటుందని, ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోవాల్సి వస్తుందని, ఘోర పరాజయంతో పరువు పోతుందని ….కావున వీటి నుంచి విముక్తి లభించాలంటే సన్యాసం స్వీకరించడం ఒక్కటే ఏకైక మార్గమని సదరు 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలి, మేథో సంపన్నుడికి జ్ఞానోదయం అయ్యిందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.
కావున కృష్ణానది ఒడ్డున కరకట్టపై నిర్వహించిన పొలిట్‌బ్యూరో సమావేశంలో పార్టీ నేతల వేదమంత్రాల మధ్య గల్లీలో బొంగరాలు, ఢిల్లీలో విష్ణుచక్రాలు తిప్పిన, దేశంలోనే సీనియర్ మోస్ట్ ప్రాంతీయ పార్టీ అధిపతి సన్యాసం స్వీకరించారని ఇందుమూలంగా తెలియజేయడమైందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఓ చాటింపు వేశారు. కావున ఇకపై ఆయన చంద్రబాబాగా కొనసాగు తారని యావత్ ఆంధ్రప్రదేశ్ సమాజానికి విన్నవించడమైందంటూ సృజనాత్మక వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
ఇక మీదట ఆయనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం బాంధవ్యాలుండవని, కేవలం ఆధ్మాత్మిక చింతనలోనే శేష జీవితాన్ని గడపడానికి నిర్ణయించుకున్నారని తెలియజేసేందుకు ఒక వైపు చింతన, మరోవైపు ఆనందం కలుగుతోంది.