టాలీవుడ్ భస్మాసుర హస్తం

ఓటీటీలు వచ్చిన కొత్తల్లో.. వాటికి ఈ స్థాయిలో ప్రజాదరణ ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు. డిష్ బిల్లు కడుతూ.. మరోవైపు ఓటీటీకి చందా ఎవరు కడతారని అనుకున్నారంతా. కానీ మొబైల్ విప్లవం ఓటీటీ ప్లాట్ ఫామ్…

ఓటీటీలు వచ్చిన కొత్తల్లో.. వాటికి ఈ స్థాయిలో ప్రజాదరణ ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు. డిష్ బిల్లు కడుతూ.. మరోవైపు ఓటీటీకి చందా ఎవరు కడతారని అనుకున్నారంతా. కానీ మొబైల్ విప్లవం ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు వరంగా మారింది. అంతకు మించి వాటికి ఊపిరిలూదింది కరోనా. లాక్ డౌన్ టైమ్ లో సినిమా థియేటర్లకు ప్రత్యామ్నాయంగా మారింది ఓటీటీ. అంతే కాదు, కాస్తో కూస్తో సినిమావారికి ఉపాధి కూడా చూపించింది. కొత్త కొత్త ఊహలకు రెక్కలు తొడిగింది.

దీంతో ఓటీటీని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలంటూ.. సినిమా ఇండస్ట్రీ మొత్తం దానిపై ఫోకస్ పెట్టింది. ఆహా లాంటి యాప్ లతో బడా నిర్మాతలు కూడా ఆ రంగంలో అడుగుపెట్టారు. ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ లను ప్రేక్షకులకు పరిచయం చేసింది, చేస్తోంది ఓటీటీ. అదే సమయంలో థియేటర్ల వరకు వెళ్లలేని సినిమాలకు ప్రత్యామ్నాయంగా మారింది.

సరిగ్గా ఇక్కడే ఇండస్ట్రీ పప్పులో కాలేసింది. ఏ ఓటీటీ వ్యవస్థనైతే ఇన్నాళ్లూ అద్భుతమని మెచ్చుకున్నారో, ఇప్పుడు అదో ఓటీటీ టాలీవుడ్ జనాలకు పక్కలో బల్లెంలా మారింది. ఓటీటీతో పోటీని వదిలించుకోలేక, దాంతో సమానంగా సినిమాలు తీయలేక కిందామీద పడుతున్నారు సినీ జనాలు.

చివరికి ఈ పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే.. ఓటీటీలను మెచ్చుకునే పెద్ద హీరోలు సైతం, తమ సినిమాలు థియేటర్లలోనే ముందు విడుదల కావాలి అనుకుంటున్నారు. ఓటీటీలతో ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ లను పరిచయం చేస్తున్న నిర్మాతలు సైతం.. తమ పిల్లల సినిమాలు థియేటర్లలోనే విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

థియేటర్లు ఎందుకు..? ఇటీవల ఓ పెద్దహీరో సినిమా విడుదలైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ ఏంటంటే.. ఇది ఓటీటీకి ఎక్కువ, థియేటర్ కి తక్కువ అని. ఆ టాక్ విన్న సదరు పెద్ద హీరో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతకంటే మంచి కంటెంట్ ఉన్న ఎపిసోడ్ లే ఓటీటీలో రన్ అవుతున్న వేళ, ఇమేజ్ అడ్డు పెట్టుకుని థియేటర్ల వరకు రావొచ్చు కానీ, హిట్ కొట్టడం మాత్రం కుదరదని తేలిపోయింది.

సినిమా థియేటర్లకు ప్రత్యామ్నాయం లేని రోజుల్లో.. ఫ్లాప్, యావరేజ్, హిట్, సూపర్ హిట్ అనే కేటగిరీలు ఉండేవి. కానీ ఇప్పుడు రెండే రెండు. హిట్టా, ఫట్టా. ఓటీటీ కంటే ఎక్కువా, తక్కువా? పెద్ద హీరోలైనా, భారీ బడ్జెట్ అయినా ఎవరూ కేర్ చేయడం లేదు. సినిమాలు ఆపేసి, ఓటీటీలో షోలు చేసుకోడానికి వెళ్లొచ్చు కదా అని సలహా పడేస్తున్నారు.

ఒకరకంగా సినిమావాళ్లు ఓటీటీని పెంచి పోషించి, ఇప్పుడు కష్టాలు కొని తెచ్చుకున్నారని అర్థమవుతోంది. ఇప్పుడు సినిమా విడుదలైతే ఫ్లాప్ మూవీ అనకుండా.. సింపుల్ గా ఓటీటీ మూవీ అనేస్తున్నారు. ఒక రకంగా ఓటీటీ ఇప్పుడు సినిమా థియేటర్లకు శాపంగా మారింది. కేవలం తమ ఇమేజ్ తో సినిమాలని మార్కెట్ చేసుకుంటున్నవారికి అడ్డుపడుతోంది. 

గతంలో వయసుమళ్లిన హీరోయిన్లు సీరియల్ ఆర్టిస్ట్ లు గా సెకండ్ ఎంట్రీ ఇచ్చినట్టు.. ఇప్పుడు క్రేజ్ తగ్గిన బడా హీరోలంతా.. ఓటీటీల వైపు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.