సెల్ఫ్ డిస్మిస్ అంటూ ఆర్టీసీ ఉద్యోగుల్ని రెచ్చగొట్టిన సీఎం కేసీఆర్, గల్ఫ్ లో పనిచేస్తున్న తెలంగాణ వాసుల్ని ఉద్యోగాలిస్తాం వెనక్కి రమ్మని పిలుస్తున్నారు. గల్ఫ్ లో పనిచేస్తూ ప్రవాస జీవితం గడుపుతున్న తెలంగాణ కార్మికుల కష్టాలపై కేసీఆర్ ప్రగతిభవన్లో సమీక్ష జరిపారు. ఈ సమీక్షే పెద్ద కామెడీ అనుకుంటే, చివర్లో వారంతా తిరిగొచ్చేయాలంటూ కేసీఆర్ పిలుపునివ్వడం దీనికి హైలెట్ గా మారింది.
గతంలో తెలంగాణలో పనులు లేక మీరంతా అక్కడికి వెళ్లి ఉండొచ్చు, ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఇక్కడ పనులూ ఉన్నాయి, మీరు తిరిగొచ్చేయండి, మీ బాధ్యత నాది అంటూ ప్రగతి భవన్ నుంచే పిలుపునిచ్చారు కేసీఆర్. అంతే కాదు, వారిని తీసుకొచ్చే బాధ్యత కూడా తనదేనంటూ చెప్పిన ఆయన, త్వరలోనే గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తానని అన్నారు. గల్ఫ్ కార్మికులు తిరిగొచ్చేలా చేసేందుకు ఉన్నత స్థాయి అధికారులతో ఓ కమిటీ కూడా వేశారు.
కేసీఆర్ చేస్తున్న పని మంచిదే అయినా, తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ వ్యవహారం పెద్ద జోక్ గా మారింది. విపక్షాలకు ఇది మరో విమర్శనాస్త్రంగా దొరికింది. సోషల్ మీడియాలో కూడా కేసీఆర్ పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. కేసీఆర్ ని నమ్ముకుని గల్ఫ్ లో ఉన్నవారంతా తిరిగొస్తే.. వారిని కూడా బజారున పడేస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ప్రభావం కేసీఆర్ పైనే కాదు, ఆయన మంత్రివర్గం, ఎమ్మెల్యేలపై కూడా పడుతోంది. మంత్రులు ఏ పర్యటనలకు వెళ్లినా, ఏ కొత్త పథకం ప్రారంభించినా ముందు ఆర్టీసీ సంగతి తేల్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలు కూడా సొంత నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నారు. నమ్మించి మోసం చేశారు కదయ్యా అంటూ ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు ఎమ్మెల్యేలను చుట్టుముడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు అజ్ఞాతవాసం గడపాల్సి వస్తోంది.