భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59)ను సోమవారం కరోనా మహమ్మారి బలిగొంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడడం, వారిలో కొందరు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో నిరాడంబర ప్రజాప్రతినిధిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సీపీఎం నేత సున్నం రాజయ్య చేరిపోయాడు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో విజయవాడకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
రాజకీయాల్లో విలువలు పతనమవుతున్న తరుణంలో సున్నం రాజయ్య మరణం ప్రజాస్వామ్య వ్యవస్థకు పెద్దలోటుగా చెప్పొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో సీపీఎం తరపున వరుసగా మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని తన సొంత గ్రామం సున్నంవారిగూడెంలో ఉంటున్నారు. సున్నం రాజయ్య ఎమ్మెల్యేగా అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిలిచారు. అసెంబ్లీకి ఆటోలో, బస్సులో వెళ్లిన ఏకైక , చిట్టచివరి ఎమ్మెల్యే కూడా ఆయనే. అంతేకాదు, సాధారణ ప్రయాణాలను కూడా సామాన్య ప్రజలతో పాటు బస్సులో సాగించిన గొప్పనేత.
మొదటిసారి నిర్వహించిన కరోనా టెస్ట్‌లో నెగెటివ్ వచ్చినా సోమవారం భద్రాచలంలో మరోసారి కరోనా పరీక్షలు చేయగా పాజి టివ్‌గా నిర్ధారణ అయ్యింది. విజయవాడకు తరలించి చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. స్వగ్రామంలో ఆయనకు నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.