ప్రముఖ విప్లవ రచయిత, గాయకుడు, జానపద కళాకారుడు వంగపండు కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు వంగపండు ప్రసాదరావు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 77 ఏళ్ల వంగపండు.. ఈరోజు ఉదయం విజయనగరం జిల్లాలోని పార్వతీపురం దగ్గరలో ఉన్న పెదబొండబల్లిలోని తన నివాసంలో కన్నుమూశారు.
ఉత్తరాంధ్ర జానపదాలకు, మాండలికాలకు విస్తృతంగా ప్రచారం కల్పించిన వ్యక్తుల్లో వంగపండు ఒకరు. తన పాటలు, రచనలతో అనేక మంది అభిమానుల్ని ఆయన సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా “ఏం పిల్లడో ఎళ్దామొస్తావా” అనే పాట ఆయనకు లైఫ్ టైమ్ గుర్తింపును తీసుకొచ్చింది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఈ పాటను ఇంగ్లిష్ లోకి అనువదించి మరీ పాడుకున్నారు.
1943లో జన్మించారు వంగపండు. అందర్లానే తనుకూడా నిరుపేదగానే కొనసాగానని, ఏదో ఒకటి చేసి పొట్టపోసుకోవాలని అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన వంగపండు.. 1970 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన గిరిజన ఉద్యమంతో వెలుగులోకి వచ్చారు. అప్పటివరకు సరదాగా పాడిన రాసుకున్న పాటలు, పాడిన పాటలు వంగపండుకు గుర్తింపు తీసుకొచ్చాయి.
ఆయన దాదాపు 400 వరకు పాటలు రాశారు. వాటిలో సగానికి పైగా పాటలు పాపులర్ అయ్యాయి. ఏం పిల్లడో పాటతో పాటు జజ్జనెకరి జనారే, నాంపల్లి స్టేషన్ కాడ (అదృష్ట దీపక్ రాశారు), యంత్రమెట్ట నడుస్తున్నదంటే లాంటి పాటలు ఆయనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టాయి. గద్దర్ వంటి వాళ్లతో కలిసి జననాట్యమండలి కోసం పనిచేశారు వంగపండు.
వంగపండుకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. ఆయన కుమార్తె వంగపండు ఉష కూడా కళాకారిణి. ప్రస్తుతం ఆమె వైసీపీ నేతగా కొనసాగుతున్నారు. అర్థశతాబ్దానికి పైగా ప్రజాకళాకారుడిగా కొనసాగిన వంగపండు మరణం.. ఉత్తరాంధ్రకే కాదు, తెలుగు సమాజానికే తీరని లోటు.