కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. హీరోయిన్ హన్సికకు కూడా అలాంటి ఓ అలవాటు ఉంది. ఓటీటీలో తనకు ఏదైనా వెబ్ సిరీస్ నచ్చితే, అది పూర్తయ్యేవరకు నిద్రపోనంటోంది ఈ బ్యూటీ.
“నాకు రొమాంటిక్ మూవీస్ అంటే చాలా ఇష్టం. రొమాంటిక్ మూవీస్ చాలా చూశాను. ఈమధ్య ఓటీటీలో వెబ్ సిరీస్ లు చూస్తున్నాను. ఏదైనా సిరీస్ నచ్చితే, అది పూర్తయ్యేవరకు నిద్రపోను. సిరీస్ మొత్తం చూడాల్సిందే. అలా చూడకపోతే ఏదోలా అనిపిస్తుంది. ఇంకే పని చేయలేను.”
ఇలా వెబ్ సిరీస్ లకు అలవాటుపడిన విషయాన్ని హన్సిక బయటపెట్టింది. తాజాగా ఆమె మైత్రీ (MY3) అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఇలా తనకున్న అలవాటును బయటపెట్టింది. ఓ సందర్భంలో ఎంజాయ్ చేయడం కోసం విదేశాలకు వెళ్లి, అక్కడో సిరీస్ నచ్చి, రోజంతా హోటల్ రూమ్ లోనే ఉండిపోయిందట ఈ చిన్నది.
ఒకప్పుడు రొమాంటిక్ మూవీస్ ఎక్కువగా చూసేదంట హన్సిక. ప్రస్తుతం ఓటీటీలో వెబ్ సిరీస్ లు ఎక్కువగా చూస్తున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. చేతిలో 3 సినిమాలున్నాయి. ఇకపై సినిమాలతో పాటు ఓటీటీకి కూడా సమప్రాధాన్యం ఇస్తానంటోంది. మైత్రీ వెబ్ సిరీస్ లో హ్యూమనాయిడ్ రోబోగా కనిపించనుంది ఈ ఆపిల్ బ్యూటీ.