బీఆర్ఎస్‌లో టికెట్ దక్కని వారిది ఒక బాధైతే, దక్కినా ఆ నాయకుడిది మరో బాధ. సంతృప్తి చెందకపోవడమే సమస్యకు మూలమని బీఆర్ఎస్ నేతల వాదన. ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మల్కాజ్‌గిరి నుంచి బీఆర్ఎస్ తరపున మైనంపల్లి హనుమంతరావు టికెట్ దక్కించుకున్నారు. అయితే ఆయన మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్‌కు టికెట్ ఆశిస్తున్నారు.
అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డిని కాదని మైనంపల్లి కుమారుడికి సీటు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక మీటింగ్‌లో పద్మ తన కూతురిగా కేసీఆర్ అభివర్ణించారు. అలాంటి పద్మా దేవేందర్‌రెడ్డిని కాదని టికెట్ దక్కదని తెలిసి కూడా మైనంపల్లి దూకుడు ప్రదర్శించారు. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సందర్భంలో మంత్రి హరీష్‌రావుపై ఘాటు విమర్శలు చేశారు.
తనకు, తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులందరికీ టికెట్లు ఇవ్వడాన్ని ఆయన నేరుగా ప్రశ్నించారు. వాళ్లకొక న్యాయం, తనకో న్యాయమా? అని ఆయన నిలదీశారు. మైనంపల్లి వ్యవహారంపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా వుంది. మరోవైపు మైనంపల్లి కూడా తగ్గేదే లే అని అంటున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంతా తానెవరినీ తిట్టనని చెప్పారు. మల్కాజ్‌గిరిలో రేపటి నుంచి తిరుగుతానని తెలిపారు. తొందరపడొద్దని, మీడియాతో మాట్లాడొద్దని శ్రేయోభిలాషులు తనతో ఒట్టు వేయించుకున్నారన్నారు. అందుకే వారం రోజుల పాటు ప్రజాభిప్రాయం తీసుకుంటానని, ఆ తర్వాతే మీడియా ముందుకొస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకంటే తన కుమారుడే ఎక్కువ పని చేస్తున్నాడని ఆయన చెప్పారు. ఆయన్ను ఎందుకు సెట్ చేయవద్దని ఆయన ప్రశ్నించారు. తనను తిట్టేవారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన కోరారు.
పార్టీని తాను ఏమీ అనలేదని మైనంపల్లి చెప్పుకొచ్చారు. అలాగే తనను కూడా పార్టీ ఏమీ అనలేదనడం గమనార్హం. మెదక్ ప్రజలు ఏది చెబితే అదే తన కొడుకు చేస్తారన్నారు. మెదక్‌లో సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు.