అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అని అంటారు. ఇదే సూత్రం జర్నలిజానికి కూడా వర్తిస్తుంది. జర్నలిజం ముసుగులో ఆంధ్రజ్యోతి చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. తిమ్మిని బమ్మ… బమ్మిని తిమ్మి చేయడంలో ఆంధ్రజ్యోతి తర్వాతే ఏ సంస్థైనా. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను బద్నాం చేయడమే ఏకైక అజెండాగా గత దశాబ్ద కాలంగా ఆంధ్రజ్యోతి విషం కక్కుతూనే ఉంది.
తాజాగా జగన్ సర్కార్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు అలాంటి దుర్మార్గ వార్తను మరోసారి వండివార్చింది. ఏకంగా ఓ గిరిజన మహిళ హత్యను అధికార వైసీపీ ఖాతాలో పడేసింది. తద్వారా వైసీపీని అణగారిన వర్గాలకు వ్యతిరేక పార్టీగా చిత్రీకరించేందుకు జర్నలిజాన్ని, నిజాన్ని హత్య చేసేందుకు కూడా ఆంధ్రజ్యోతి వెనుకాడదనేందుకు ఈ వార్తా కథనం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, వాటి అనుబంధ చానళ్లు ఈటీవీ, ఎబీఎన్ ఎల్లవేళలా చంద్రబాబును కీర్తిస్తుంటాయి. ఇదే సందర్భంలో బాబు ప్రత్యర్థి జగన్‌ను దూషిస్తుంటాయి. గుంటూరు జిల్లాలో సోమవారం ఓ గిరిజన మహిళను ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో తొక్కించి చంపాడు. ఈ వార్తను బాబు మానస పుత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించాయి.
ఓ దుర్మార్గాన్ని ప్రజలకు కళ్లకు కట్టేలా తెలియజేసి, అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా మీడియా తన వంతు పాత్ర నిర్వర్తించాలి. రాజకీయ ఎజెండాతో రాతలు రాయడం…నిజాలకు పాతరేయడం….ఈ హత్య వార్తను ప్రచురించడం లో ఆంధ్రజ్యోతి నైజాన్ని, నిజ స్వరూపాన్ని చూడొచ్చు.
ముందుగా ఈనాడు వార్తను పరిశీలిద్దాం.
‘అప్పులు చెల్లించలేదని ట్రాక్టర్‌తో తొక్కించి…’ శీర్షిక, అలాగే ‘గిరిజన మహిళ హత్య, గుంటూరు జిల్లాలో దారుణం’ అనే ఉప శీర్షికలతో కథనాన్ని క్యారీ చేశారు. ఇక కథనంలోకి వెళితే….గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివాపురం తండాకు చెందిన మంత్రుబాయ్ (55)ని అప్పు చెల్లించలేదనే కారణంతో శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి ట్రాక్టర్‌తో తొక్కించి ప్రాణం తీశాడని వార్త రాశారు. ఈ కథనంలో ఎక్కడా కూడా నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ఫలానా పార్టీకి చెందిన వ్యక్తి అని రాయలేదు. ఒకవేళ నిందితుడు వైసీపీ నాయకుడైతే ఈనాడు విడిచి పెడుతుందా?
ఇదే హత్య వార్తను ఆంధ్రజ్యోతి ఎలా రాసిందో తెలుసుకుందాం. ‘అప్పు కట్టలేదని ట్రాక్టర్‌తో తొక్కించి…’ శీర్షిక, ‘గిరిజన మహిళను బలిగొన్న వైసీపీ నేత’ అనే ఉపశీర్షికతో వార్తను క్యారీ చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి హెడ్డింగ్‌లు ఒకటే. ప్రయారిటీ విషయానికి వస్తే రెండు పత్రికలు కూడా మొదటి పేజీలో ప్రచురించాయి. కానీ ఆంధ్రజ్యోతి కథనంలోకి వస్తే…ఇక్కడ నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని వైసీపీ ఖాతాలో వేయడం గమనార్హం.
‘అప్పు వసూలు కోసం వైసీపీ నేత ఒకరు అరాచకానికి పాల్పడ్డారు’ అని ఆంధ్రజ్యోతి వార్తా కథనం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చివర్లో ‘శ్రీనివాస్‌రెడ్డి స్థానికంగా వైసీపీలో చురుకైన నాయకుడు’ అని ఒక వాక్యం. ఈ వాక్యాలు తప్ప వైసీపీ నాయకుడిగా నిరూపించే ఆధారాలేవీ లేవు. కేవలం సామాజికవర్గాన్ని బట్టి వైసీపీ ఖాతాలో వేసినట్టుగా అర్థమవుతోంది.
వైసీపీకి బలమైన మద్దతుదా రులుగా నిలిచిన గిరిజనుల మనసుల్లో ఆ పార్టీపై వ్యతిరేకతను పెంచేందుకు ఏకంగా నిజాల్ని కూడా హత్య చేసేందుకు ఆంధ్రజ్యోతి వెనుకాడని వైనాన్ని ఈ కథనంలో చూడొచ్చు. ఇంత కంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా?
అప్పు చెల్లించలేదని గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన శ్రీనివాసరెడ్డికి, తమకు గిట్టని నాయకుడు వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారనే అక్కసుతో, నిందితుడు వైసీపీ నాయకుడని రాసిన ఆంధ్రజ్యోతికి తేడా ఏంటి? ఆంధ్రజ్యోతి రాతలు విషపు సిరాతో రాస్తారనేందుకు ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి? హత్య అంటే కేవలం భౌతికపరమైంది మాత్రమే కాదు. అది మానసిక పరమైంది కూడా. అదెలా ఉంటుందంటే ఆంధ్రజ్యోతి రాతలకు ప్రాణాలు కోల్పోయే సత్యానికి మాత్రమే తెలుసు. సత్యం వధః అంటే ఇదే కదా!