తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తన హెచ్చరికను జారీ చేసేశారు! 48 గంటల్లోగా మూడు రాజధానుల బిల్లును జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలట.. లేకపోతే.. ఇంతకీ ఏం చేస్తారో చంద్రబాబు నాయుడు చెప్పలేదు! ఆయన అనుకూల మీడియా కథనాలను గాలించినా, ఇందుకు సమాధానం దొరకలేదు! 48 గంటల గడువును పెట్టిన చంద్రబాబు నాయుడు ఈ 48 గంటలు గడిస్తే ఏం చేయబోతున్నారో ఇంకా చెప్పలేదు!
ప్రభుత్వం బిల్లును వెనక్కు తీసుకోవాలని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తేల్చిన చంద్రబాబు నాయుడు, ఇంతకీ ఈ రెండూ జరగకపోతే తను ఏం చేయబోతున్నట్టో ప్రకటించకపోవడం గమనార్హం! ఇంతకీ 48 గంటల తర్వాత ఏం చేస్తారు? అంటే.. మళ్లీ మీడియా ముందుకు వస్తారట!
48 గంటల గడువును ఇచ్చిన పెద్దమనిషి, ఈ 48 గంటలూ గడిచిన తర్వాత తను ఏం చేయనున్నట్టో కూడా తన అల్టిమేటంలో ప్రకటించాల్సింది! బంద్ చేస్తారా? మిలిటెంట్ తరహా పోరాటాలు చేస్తారా? జగన్ ను ఘెరావ్ చేస్తారా? ఇంతకీ ఏం చేయనున్నట్టో ముందే ఒక మాట చెప్పి ఉంటే.. జనాలకూ క్లారిటీ ఉండేది! 48 గంటలు టైమిచ్చి, తను చెప్పినట్టుగా చేయకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో చంద్రబాబు చెప్పకపోవడం, ఈ సవాల్ లోని డ్రామాను మిస్ అయ్యేలా చేస్తోంది!
చంద్రబాబు నాయుడి హెచ్చరికను ఎలాగూ జగన్ ప్రభుత్వం లెక్క చేయదు, అందులో ఎవరికీ సందేహాలు లేవు. 48 గంటల సమయం ఇవ్వడం కూడా టైమ్ వేస్ట్ మాత్రమే. తను చేయలనుకున్నదేదో చంద్రబాబు నాయుడు ఇప్పుడే చేసుకోవచ్చనే విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు, అయినా సీరియల్స్ ను తలపించే మిస్టరీని ఏదో నడిపించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉండటమే.. కామెడీ అవుతోంది!